13న రాష్ట్రంలోకి నైరుతి 

9 Jun, 2019 07:14 IST|Sakshi

కేరళను తాకిన రుతుపవనాలు

13న తెలంగాణలోకి ప్రవేశం

15 నాటికి రాష్ట్రమంతా విస్తరించే అవకాశం

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు 

ఈ ఏడాది సాధారణ వర్షాలు... 

97 శాతం మేర కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఆదివారం ఉదయం కేరళను తాకినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాల్దీవులు, కోమోరిన్‌ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్ష దీవుల్లో చాలా ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి, సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. అక్కడినుంచి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వాస్తవంగా రుతుపవనాలు ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. రెండ్రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవే శించాయి. భూమి వేడి తగ్గితేనే రుతుపవనాలు వేగం గా ప్రవేశిస్తాయని, వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఏడాది 97 శాతం వర్షాలు... 
సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మిల్లీమీటర్లు కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది ఇదే సీజలో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా కేవలం 92 శాతమే వర్షం కురిసింది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఇప్పుడే మరింత ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్‌ 7న ప్రవేశించాయి. ఇప్పుడు 8న వచ్చాయి.

ఉపరితల ఆవర్తనంతో అక్కడక్కడా వర్షాలు.. 
మరోవైపు తూర్పు పశ్చిమ షియర్‌ జోన్‌ దక్షిణ భారత్‌ మీదుగా 2.1 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఫలితంగా రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి కాస్తంత ఉపశమనం ఏర్పడింది. రుతుపవనాల రాకకు ముందు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
 
వివిధ సంవత్సరాల్లో కేరళకు, తెలంగాణల్లోకి  చల్లబడ్డ హైదరాబాద్‌... 
నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లో నగరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు శుక్ర, శనివారాల్లో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉంటే శనివారం నగరంలో పగటిపూట 34 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు కాగా, అత్యల్పంగా 22.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువ కావటం విశేషం. కాగా, శుక్రవారం నగరంలో అత్యధికంగా హకీంపేటలో 26.4 ఎంఎం, మేడ్చల్‌లో 17.8 ఎంఎం వర్షం కురిసింది. 

వ్యవసాయ ప్రణాళిక విడుదలపై అధికారుల నిర్లక్ష్యం... 

ఖరీఫ్‌ మొదలైంది. త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు రానున్నాయి. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆ ప్రకారం వ్యవసాయశాఖ ప్రణాళిక విడుదల చేయాలి. మే నెలలోనే రైతుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతుంది. సాధారణ పంటల సాగు 2019–20 ఖరీఫ్, రబీల్లో ఎంతెంత చేసే అవకాశముందో ప్రణాళికలో వివరిస్తారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తరుణంలో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో అదనంగా ఏడెనిమిది లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. ఆ ప్రకారం ఎంత సాగు పెరిగే అవకాశముందో అంచనా వేస్తారు. అంటే సాధారణ సాగు విస్తీర్ణం, పెరిగే విస్తీర్ణాన్ని ప్రణాళికలో ప్రస్తావిస్తారు. మరోవైపు ఉత్పత్తి, ఉత్పాదకతల లక్ష్యాన్ని కూడా వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో ప్రస్తావిస్తుంది. ఎరువులు, విత్తనాల లక్ష్యం, సరఫరాలను ప్రస్తావిస్తారు. కానీ ఇంతవరకు ప్రణాళికను అధికారులు విడుదల చేయకపోవడంపై సర్కారు పెద్దలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు రైతుబంధు పథకం కింద నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఖరీఫ్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు