రక్తమోడుతున్న... రహదారులు

20 Jun, 2019 08:46 IST|Sakshi

రోడ్డు భద్రతపై కొరవడిన స్వయంప్రతిపత్తి

వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం

ఏటా మృత్యువాతపడుతున్న వేలాది మంది  

సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదకరమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఏటా వేలాది మందిని కబళిస్తున్నాయి. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వందల సంఖ్యలో బ్లాక్‌స్పాట్స్‌ (ప్రమాదకరమైన ప్రాంతాలు)ను గుర్తించారు. ప్రభుత్వం రహదారి భద్రతను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రోడ్డు భద్రతపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించే  ప్రతిపాదన మంగళవారం నాటి కేబినెట్‌  సమావేశంలో వాయిదా పడినప్పటికీ ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటైన రహదారి భద్రతా మండలి అనేక అంశాలపై విస్తృతంగా చర్చించింది. రహదారుల నిర్మాణం, ప్రమాదాలకు  దారితీస్తున్న  పరిణామాలు  వంటి అంశాలపై  అధికారులు దృష్టి సారించారు. రోడ్లు భవనాల శాఖ, రవాణా, పోలీసు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ తదితర విభాగాల ప్రాతినిధ్యంతో ఏర్పాటైన రోడ్డు భద్రతా మండలిని  ముందుకు తీసుకెళ్లడంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ  (లీడ్‌ ఏజెన్సీ) అవసరమని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మండలిలో ఉన్న భాగస్వామ్య సంస్థల్లోనే ఏదో ఒక  సంస్థకు లీడింగ్‌ బాధ్యతలు అప్పగించడం వల్ల పారదర్శకత లోపిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంగళవారం రోడ్డు భద్రత బిల్లును ఆమోదించి చట్టంగా రూపొందించే ప్రతిపాదన వాయిదా పడడం కూడా తాజాగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని లోపాలను సవరించాల్సి ఉన్నట్లు  సమావేశంలో  పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రమాదాలను పూర్తిగా అరికట్టి, రోడ్డు భద్రతలో మెరుగైన, నాణ్యమైన ఫలితాలను సాధించేందుకు  స్వతంత్రంగా పని చేసే ఏజెన్సీ అవసరమని కొందరు  అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా రోడ్డు భద్రతా మండలి దృష్టి సారించాల్సి ఉంది.  

పక్కా కార్యాచరణ అవసరం..  
రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. గతేడాది డిసెంబర్‌ నాటికి తెలంగాణలో సుమారు 6,603 మంది మృత్యువాత పడ్డారు. మరో 23 వేల మందికిపైగా క్షతగాత్రులయ్యారు. గత రెండు మూడేళ్లుగా మృతుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రమాదాల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ అంతటా 173  ప్రమాదకరమైన (బ్లాక్‌స్పాట్స్‌)ను గుర్తించారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 150 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నాయి. రాష్‌ డ్రైవింగ్, డ్రంకన్‌ డ్రైవింగ్, స్పీడ్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్ల నిర్మాణంలో  ఇంజినీరింగ్‌ లోపాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. లోపాలను సరిదిద్దడంలో పటిష్టమైన యంత్రాంగం ఎంతో అవసరమని రోడ్డు భద్రతా మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న  ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘మండలిలో ఉన్న ప్రభుత్వ విభాగాల్లో ఏదో ఒకటి లీడ్‌ ఆర్గనైజేషన్‌గా వ్యవహరించడం వల్ల ఆ సంస్థ మిగతా సంస్థల లోపాలను మాత్రమే ఎత్తి చూపుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. అలా కాకుండా రోడ్డు భద్రతా చట్టం అమలులో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలంటే స్వతంత్ర సంస్థ అవసరం’ అని  పేర్కొన్నారు. గత ఏడాది రోడ్డు భద్రతా బిల్లును ప్రతిపాదించినప్పటి నుంచి ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సమావేశాలను నిర్వహించింది. కేబినెట్‌ సబ్‌కమిటీ సూచనల మేరకు ఉన్నతాధికారులు కేరళలో రోడ్డు భద్రతను అధ్యయనం చేశారు.

అనంతరం అనేక ప్రతిపాదనలు చేశారు. స్కూళ్లలో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా పాఠ్యాంశాలను బోధించాలని ప్రతిపాదించారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ మూడు రోజుల పాటు ఉచిత వైద్య సదుపాయం అందజేయాలని  సూచించారు.మరోవైపు  హైవేలపై నిరంతర గస్తీ నిర్వహించడంతో పాటు, అంబులెన్స్‌ సదుపాయం అందుబాటులో ఉండడం, మద్యం దుకాణాలు రహదారులకు దూరంగా తరలించడం వంటివి అమల్లోకి కూడా వచ్చాయి. అనేక చోట్ల  రోడ్లకు మరమ్మతులు కూడా పూర్తి చేశారు. రోడ్డు భద్రతలో కొంత పురోగతి ఉన్నప్పటికీ మరింత పక్కాగా అమలు చేసేందుకు స్వయంప్రతి కలిగిన సంస్థ అవసరం ఎంతో ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.  

గ్రేటర్‌లో ప్రమాదాలనియంత్రణపై దృష్టి..
నగరంలోని 150 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం రాజ్‌భవన్‌ రోడ్డులో పాదచారులు ఇటు వైపు నుంచి అటు వైపు రోడ్డు దాటడం వల్ల  ప్రమాదాలకు గురవుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఈ మార్గంలో ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు అవకాశం లేకుండా  పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించిన అన్ని చోట్ల  ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.  

మరిన్ని వార్తలు