పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు

31 Jul, 2018 02:07 IST|Sakshi

ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన రానున్న నేపథ్యంలో సోమ వారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు, బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేకాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసినా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఒకేసారి 4 వేలకుపైగా గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. 4,383 నూతన పంచాయతీలను ఆగస్టు 2న పండగ వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

పట్టణాలకు దీటుగా గ్రామాలకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన పంచా యతీ నిధులను, కొత్త పంచాయతీలకు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. మౌలిక సదుపాయాలతోపాటు కొత్త పంచాయతీలకు బోర్డులు ఏర్పాటు చేయడంలాంటి వాటికి నిధులు కేటాయించినట్టు చెప్పారు.  కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

జాయింట్‌ అకౌంట్లు తెరవాలి
పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారులంతా నూతన పంచాయతీల్లో తక్షణమే పంచాయతీల తరఫున బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్లు తెరవాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ గ్రామంలోనూ నర్సరీల ఏర్పాటుతోపాటు ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించిన తర్వాతే సర్పంచ్‌లను కొనసాగించలేని పరిస్థితులున్నాయని వివరించారు.

ఎన్నికలు జరగకుండా కోర్టుకు ఎవరెళ్లారో అందరికీ తెలుసని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. బీసీ గణనతోపాటు, ఎన్నికలను వీలైనంత వేగంగా నిర్వహించడానికి న్యాయపరంగానూ పోరాడుతామని అన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు