72 ఏళ్ల క్రితమే ఆకాశాన హజ్‌కు..

31 Jul, 2018 02:04 IST|Sakshi
1946లో తొలిసారి హజ్‌కు బయలుదేరిన విమానం ఇదే..

దేశంలోనే తొలిసారి నగరం నుంచి జెడ్డాకు విమానం

1946 అక్టోబర్‌ 22న బేగంపేట నుంచి 18 మందితో ప్రయాణం

దక్కన్‌ ఎయిర్‌వేస్‌ ఆధ్వర్యంలో ఐదేళ్లు కొనసాగింపు

స్వాతంత్య్రం అనంతరం మూడేళ్లు నిలుపుదల

1946, అక్టోబర్‌ 22.
ఆ రోజు మంగళవారం నగరమంతా సందడిగా ఉంది. జంట నగరాల నుంచి బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 6 గంటల నుంచే జనం వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విమానాశ్రయం జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌లో ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ.. దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించిన రోజు. దేశంలోనే తొలిసారి హజ్‌ యాత్రకు వెళ్లేందుకు విమానం సిద్ధమైంది.ఉదయం 10 గంటలకు 18 మంది యాత్రికులతో డకోటా డీ–3 విమానం గాలిలోకి ఎగిరింది. అలా దేశంలోనే తొలిసారి హజ్‌ యాత్రకు దక్కన్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ విమానానికి పైలెట్లుగా కెప్టెన్‌ కాక్స్, మునిషీ, రేడియో ఆపరేటర్‌గా నాసిర్, ఫ్లైట్‌ ఇంజనీర్‌గా లార్డ్‌ వ్యవహరించారు. మంగళవారం నుంచి హజ్‌ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్‌


1400 ఏళ్ల క్రితమే...
1400 ఏళ్ల క్రితం నుంచే వివిధ దేశాల నుంచి సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్‌ ఆరాధనల కోసం ముస్లింలు వెళుతున్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన బహుమనీలు, కుతుబ్‌ షాహీలు, ఆసిఫ్‌జాహీల కాలం నుంచే ముస్లింలు హజ్‌కు రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. 72 ఏళ్ల క్రితం దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు విమానంలో యాత్రకు వెళ్లారు. 1946లో ఒక విమానంలో 18 మంది వెళ్లగా, ప్రస్తుతం 25 విమానాల్లో దాదాపు 8 వేల మంది వెళుతున్నారు.

హకీంపేట్‌ రన్‌వే నుంచి..
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచి కూడా హజ్‌కు విమాన సర్వీసులు లేవు. 1947లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రెండోసారి విమానం హజ్‌ యాత్రకు వెళ్లింది. అయితే యాత్రికుల సంఖ్య ఎక్కువ కావడం, బేగంపేట్‌ విమాన రన్‌వే తక్కువగా ఉండడంతో హకీంపేట్‌లో విమాన రన్‌వే అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి హజ్‌ యాత్రకు బయలుదేరినట్లు ఇంటాక్‌ తెలంగాణ కో కన్వీనర్‌ అనురాధ తెలిపారు.

ఆగుతూ.. హజ్‌ యాత్రకు..
హైదరాబాద్‌ నుంచి హజ్‌ యాత్రికుల విమానాలు నేరుగా సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లేవి కావు. ఇంధనం ఇబ్బందులుండటంతో సిరియా, ఈజిప్టు, ఇరాక్‌తో పాటు ముంబై, కరాచి, షార్జాలో ఆగి వెళ్లేవారు. దక్కన్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు హజ్‌ యాత్రకు 1946, 1947.. రెండేళ్ల పాటు నడిచాయి.

అనంతరం దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంతో జరిగిన పరిణామాల దృష్ట్యా 1948–1950 వరకు విమానాలు హజ్‌ యాత్రకు వెళ్లలేదు. మళ్లీ 1951 నుంచి 1953 వరకు హైదరాబాద్‌ నుంచి హజ్‌ యాత్రకు విమానాలు వెళ్లాయి. 1953లో దక్కన్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌ ఇండియాలో విలీనం కావడంతో హజ్‌ యాత్రకు విమానాలు రద్దు చేశారు.

ఆసిఫ్‌ జాహీల కాలంలో రైలు మార్గాన..
నిజాం హయాంలో హైదరాబాద్‌లో 1874లో రైల్వే లైన్‌ ప్రారంభమైంది. దీంతో సంస్థానం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారు రైలు మార్గం ద్వారా ముంబైకి చేరుకొని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నౌకాశ్రయానికి చేరుకునేవారు. నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లేవారికి నాంపల్లిలో ప్రభుత్వం తరఫున ఉచితంగా భోజన వసతి ఉండేది. ఏడవ నిజాం ఉస్మాన్‌అలీ హయాం వచ్చే సరికి నాంపల్లి స్టేషన్‌ హజ్‌ యాత్ర సమయంలో జనసంద్రంగా మారేది. యాత్రికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో పాటు సాధారణ జనం కూడా అక్కడికి వచ్చేవారు.

1994 వరకు నౌకాయానం.. తిరిగి విమాన యానం
తొలుత హైదరాబాద్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారు రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా ముంబైకి చేరుకునే వారు. మొదట్లో ఇంజన్‌ నౌకలు లేకపోవడంతో పరదా వాటిల్లోనే యాత్ర సాగేది. రంజాన్‌ 2 నెలల తర్వాత హజ్‌ ఆరాధనలు వస్తాయి. రంజాన్‌ నెల ఉపవాసాల కంటే ముందే హజ్‌ ఆరాధనలకు ఇళ్ల నుంచి బయలుదేరే వారు. నేను 1969 నుంచి హజ్‌ యాత్రకు వెళుతున్నా. అప్పటి నుంచి అందరి సామాన్లు మోసేవాడిని. అందుకే అందరూ నన్ను హబీబ్‌ కూలీగానే పిలుస్తారు.

ఆ రోజుల్లో రంజాన్‌ కంటే ముందు ముంబై నుంచి సౌదీ, ముజ్జదీ అనే 2 నౌకలు, రంజాన్‌ తర్వాత ముహ్మదీ, అక్బర్, నూర్జహా పేర్లతో నౌకలు హజ్‌కు వెళ్లేవి. నౌక ప్రయాణం దాదాపు పదమూడు నుంచి పదిహేను రోజులు పట్టేది. చివరిసారిగా 1994 వరకు నౌకాయానం జరిగింది. అనంతరం విమానయానం ప్రారంభమైంది. – హజ్‌ సేవకుడు హబీబ్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఇల్యాస్‌ హబీబ్‌ కూలీ

మరిన్ని వార్తలు