నిరుటి కంటే తక్కువే..!

11 Mar, 2015 09:34 IST|Sakshi
నిరుటి కంటే తక్కువే..!

హైదరాబాద్:  ఆశల పల్లకి నుంచి ఆచరణాత్మక బడ్జెట్ దిశగా తెలంగాణ సర్కారు కొత్త పంథాకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆదర్శంగా చేసుకొని.. ఈసారి కొత్త బడ్జెట్ రూపకల్పనకు మొగ్గు చూపుతోంది. వృద్ధి రేటు, అభివృద్ధిని పక్కనబెట్టి వాస్తవాలను ప్రతిబింబించే విధంగా 2015-16 బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ నెల 11న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షించనుంది.  పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో ఎంత మొత్తం కేటాయింపులుంటాయి..? తొలి బడ్జెట్ రూ.లక్షా 637 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి అంతకుమించి భారీ బడ్జెట్ ప్రవేశపెడుతుందా.. లేదా కొంత వెనక్కు తగ్గుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.  
 
ప్రభుత్వం గత నవంబర్ లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అం చనాలన్నీ ఆచరణలో తలకిందుల య్యాయి. ఆశించినంత రెవెన్యూ రాబడి లేకపోవటం.. కేంద్రం నుంచీ పెద్దగా నిధులు రాకపోవటం తో సర్కారు ఇరకాటంలో పడింది. ఫిబ్రవరి వరకు ఉన్న ఆదాయ వ్యయాల అంచనాలను విశ్లేషిస్తే 2014-15 బడ్జెట్‌లో దాదాపు రూ. 40 వేల కోట్ల కోత తప్పని పరిస్థితి తలెత్తింది. అందుకే ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించాలని.. వాస్తవాల ఆధారంగా మంచి చెడులను ప్రజ లకు విడమర్చి చెప్పాలని.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గతంలోలా పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది.

ఆశించిన స్థాయిలో రాని ఆదాయం
నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటి నుంచి నేటివరకు ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. రూ.80,090 కోట్ల రెవె న్యూ ఆదాయం లభిస్తుందని భావించింది. ఫిబ్రవరి ఒకటి నాటికి కేవలంరూ.30,187కోట్ల ఆదాయమే వచ్చింది. రెండోవారానికి ఈ ఆదాయం రూ.33 వేల కోట్లకు పెరిగినప్పటికీ ఖజానాకు పెద్దగా ఒరి గిందేమీ లేదు. దీంతో ఆర్థిక లోటు రూ.47 వేల కోట్లకు చేరినట్లు స్పష్టమవుతోంది. మార్చి మొదటివారంలోనూ ఇంచుమించుగా ఈ లోటు రూ.40 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో.. గతంలో నేల విడిచి సాము చేసిన సర్కారు ఇప్పుడు దిగొచ్చింది.

తగ్గిన కేంద్ర నిధులు
కేంద్ర ప్రభుత్వ పన్నులు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.14 వేల కోట్ల నిధుల్లో ఇప్పటి వరకు రూ. 8,768 కోట్లే వచ్చాయి. మిగతా రూ.6 వేలకోట్లకు పైగా నిధులపై కేంద్రం నోరు మెదపటం లేదు. పదమూడో ఆర్థిక సంఘం నిధుల్లోనూ భారీ కోతలే పడ్డాయి. విభజనానంతరం ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ వాటాగా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా.. వెయ్యి కోట్లే వచ్చాయి. భూముల అమ్మకం ద్వారా వస్తాయని భావిం చిన రూ.6,500 కోట్లలో రూ.66 కోట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ గతం కంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త పథకాలు ఉండనట్టే!
తొలి బడ్జెట్‌ను పరిశీలిస్తే పది నెలల కాలానికి రూ.లక్షా 637 కోట్లు కేటాయించారు. ఈ ప్రకారంగా చూస్తే ప్రస్తుత  బడ్జెట్ రూ.లక్షా 20 కోట్లు దాటాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితేం కనిపిం చడం లేదు. ‘గతంలో ప్రవేశపెట్టింది తొలి బడ్జెట్. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాలకు మించి హామీలి చ్చారు. వాటిని అమలు చేయాలన్నా.. జనం లో ఆత్మస్థైర్యం నింపాలన్నా..  ప్రజల ఆకాం క్ష ల మేరకు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరైంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అందుకే కొంత వెనుకడుగు వేయక తప్పదు..’ అని ఆర్థికశాఖ వర్గాలు తమ అభిప్రాయం వ్య క్తం చేశాయి.  కొత్త పథకాల జోలికి వెళ్లకుండా.. ఉన్నవాటికే నిధులు కేటాయించాలనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది.

ఉన్నవాటికే ప్రాధాన్యం
కేజీ టు పీజీ పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం లో ప్రారంభించాలని.. దీన్ని అమలు చేసేం దుకు మండల స్థాయిలో ప్రస్తుతమున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జ్యోతి రావు పూలే పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.  డబుల్ బెడ్ రూం ఇళ్ల  పథకా నికి చోటు కల్పించే అవకాశముంది. అమల్లో ఉన్న పది పథకాలను ఈసారి బడ్జెట్‌లో మరిం త ఫోకస్ చేయాలని నిర్ణయించింది.

హరితహారం, కొత్త రోడ్ల నిర్మా ణం, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యు త్తు, భూముల కొనుగో లు, హాస్టళ్లకు సన్నబి య్యం, అంగన్‌వాడీలకు అదనపు పౌష్టికాహారం, కల్యాణలక్ష్మి పథకాలకు అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీకి, విద్యుత్తు సమస్యను అధిగమిం చేందుకు నిర్మించ తలపెట్టిన కొత్త ప్లాంట్లను వేగవంతం చేసేందుకు ఈసారి బడ్జెట్‌లో అదనంగా నిధులు కేటాయించే అవకాశముంది.

మరిన్ని వార్తలు