ఆ అధికారం మున్సిపల్‌ డైరెక్టర్‌కు..

1 Jan, 2020 01:27 IST|Sakshi

ఆర్వోలు, అసిస్టెంట్‌ ఆర్వోలను నియమించేది వారే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో (జీహెచ్‌ఎంసీ మినహా) రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారుల నియామక అధికారాన్ని మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌కు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త మున్సిపల్‌ చట్టంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) అంటే ఎస్‌ ఈసీ నియమించే ఒక అధికారి అనే నిర్వచనంతో పాటు, ఒకరు లేదా ఇద్దరిని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించే అధికారం ఎస్‌ఈసీకి లేదా కమిషన్‌ ద్వారా నియమితులైన వారికి కల్పించింది.

మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ను మున్సిపల్‌ ఎన్నికల అధికారిగా నియమిస్తూ గతంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ద్వారా మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌కు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో (జీహెచ్‌ ఎంసీ మినహా) ఆర్వోలు, అసిస్టెంట్‌ ఆర్వోలను నియమించే అధికారాన్ని ఎస్‌ఈసీ కల్పించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా ఆర్వోలు, అసిస్టెంట్‌ ఆర్వోలను నియమిస్తారని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

రిజిస్టర్డ్‌ పార్టీలకు కామన్‌ సింబల్స్‌.. 
తమ వద్ద రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీల అభ్యర్థులు మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా లేదా ఎంపీటీసీ/జెడ్పీటీసీలుగా పోటీ చేసేటప్పుడు వారికి ఫ్రీసింబల్స్‌ జాబితాలోని కామన్‌ సింబల్‌ కేటాయించేలా నిబంధనలు సవరిస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. సంబంధిత రాజకీయ పార్టీ ఎన్నికలు జరగనున్న వార్డు స్థానాలు, ఎంపీటీసీ/జెడ్పీటీసీ స్థానాల్లోని కనీసం 10 శాతం సీట్లలో పోటీచేయాలని తెలిపింది. ఎస్‌ఈసీకి సింబల్‌ నోటిఫికేషన్‌ వెలువడేలోగా ఐదు రోజుల్లోగా సదరు పార్టీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎస్‌ఈసీ సెక్రటరీ పేరిట రూ.10 వేల డీడీ డిపాజిట్‌ సమర్పించాలని, ఒకవేళ పది శాతం మంది అభ్యర్థులను పోటీకి నిలపకపోతే కామన్‌ సింబల్‌ తో పాటు రూ.10 వేల డిపాజిట్‌ కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. రిజిస్టర్డ్‌ పార్టీ ఫ్రీ సింబళ్ల నుంచి ఎంపిక చేసుకున్న పది సింబళ్లను ప్రాధాన్యతా క్రమంలో ఎస్‌ఈసీకి తెలపాలి. కామన్‌ సింబళ్లను ఇచ్చి నప్పటి నుంచి ఐదేళ్ల దాకా రిజిస్టర్డ్‌ పార్టీలకు ఆ గుర్తులు ఇస్తారు. రెండుకు మించి పార్టీలు ఒకే చిహ్నం కోరుకుంటే డ్రా ద్వారా కేటాయిస్తారు. ఏదైనా రాజకీయ పార్టీ గత అసెంబ్లీ, లోక్‌సభ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా కామన్‌ సింబల్‌తో పోటీచేసి ఉంటే ఆ సింబల్‌ను ఆ పార్టీకి కేటాయిస్తారు. ఏదైనా కారణం వల్ల కామన్‌ సింబల్‌ ను రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థికి కమిషన్‌ కేటాయించలేకపోతే ఆ పార్టీని సంప్రదించి మరో సింబల్‌ను కేటాయించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు