నేటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

9 Nov, 2018 11:32 IST|Sakshi

ముగిసిన క్వాలీఫై రౌండ్స్‌ 

మూడు రోజులపాటు సాగనున్న

సబ్‌ జూనియర్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

సాక్షి,వరంగల్‌ స్పోర్ట్స్‌: మూడు రోజులపాటు కొనసాగనున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్‌ బాలబాలికల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌–2018 పోటీలకు హన్మకొండలోని సుబేదారిలోని వరంగల్‌ క్లబ్‌ ముస్తాబైంది. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు గురువారం క్వాలీఫైయింగ్‌ రౌండ్స్‌ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేశారు. వరంగల్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల వివరాలను సాయంత్రం వరంగల్‌ క్లబ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రమేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీలను శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు బి.చేతన్‌ ఆనంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని  తెలిపారు.

పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది టెక్నికల్‌ అఫీషియల్స్‌ పాల్గొంటున్నారని తెలిపారు. వారందరికీ నగరంలోని కిట్స్, నిట్‌తోపాటు వివిధ ప్రైవేట్‌ హోటళ్లలో వసతి సదుపాయాలను కల్పించామని తెలిపారు. 11న జరిగే ముగింపు వేడుకలకు వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీ సీహెచ్‌ దీప్తి హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తారని తెలిపారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ  క్రీడలను ప్రోత్సహించేందుకు క్లబ్‌ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. మూడు రోజులపాటు సాగనున్న క్రీడల నేపథ్యంలో తమ సభ్యులు సహకరించాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి పి.రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్‌ , టెక్నికల్‌ అఫీషియల్స్‌ కొమ్ము రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు