గాలివాన బీభత్సం

5 Jun, 2017 01:54 IST|Sakshi
గాలివాన బీభత్సం

‘యాదాద్రి’ జిల్లాలో భారీగా ఆస్తి నష్టం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ, ఆత్మకూరు(ఎం), భువనగిరి, ఆలేరు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారు జామున ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి వలిగొండ మండలం రేడ్లరేపాక, సుంకిశాల, ఆత్మకూరు(ఎం) చాడ, కొండాపూర్, కాటేపల్లి, రాయిపల్లి చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది.

సుంకిశాల చెరువు నిండి అలుగు పారడంతో రోడ్లపై నీరు వచ్చింది. తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో వలిగొండ మండలం మల్లేపల్లి, వెల్వర్తి మధ్యనగల కోళ్ల ఫారాలు కొన్ని నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. వెల్వర్తిలో పలు నివాస గృహాల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కేరు వాగులో నీటి ప్రవాహం మొదలైంది.

దమ్మపేటలో వాగులకు పోటెత్తిన వరద.
దమ్మపేట(అశ్వారావుపేట): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే మబ్బులు కమ్మేశాయి. దమ్మపేటలో 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మండలంలోని మల్లెపూల వాగు, శ్రీరాంపురం పెద్దచెరువుకు వరదనీరు పోటెత్తింది. కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, బూర్గంపాడు, జూలూరుపాడు తదితర ప్రాంతా ల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది.

పిడుగుపాటుకు రైతు మృతి...
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డికి చెందిన రైతు పెంజర్ల నరేందర్‌రెడ్డి(56) పిడుగుపాటుతో మరణించా డు. శనివారం ఆయన గేదె పాలు తీసేందుకు పొలం వద్దకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది.

మరిన్ని వార్తలు