వైద్యం ఒకచోట...మందులు మరోచోట..

11 Dec, 2017 01:47 IST|Sakshi
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆర్టీసీ డిస్పెన్సరీ

ఆర్టీసీ డిస్పెన్సరీల్లో వింత వ్యవహారం

వాటి ప్రైవేటీకరణతో నెలకొన్న పరిస్థితి 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌: రవీందర్‌.. ఆర్టీసీ డ్రైవర్‌.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌లోని ఆర్టీసీ డిస్పెన్సరీకి తీసుకెళ్లారు.. డాక్టర్‌ కొన్ని టెస్టులు చేసి వ్యాధి నివారణకు మందులు రాశాడు.. మందులు కొనేందుకు కౌంటర్‌ వద్దకు వెళ్తే.. ‘మందులిక్కడ ఇవ్వం.. గాంధీనగర్‌లోని మెడ్‌ప్లస్‌ షాపులో కొనుక్కో’అన్నారు. అనారోగ్యం కారణంగా ఓపిక లేకపోయినా ఆటోలో గాంధీనగర్‌ వెళ్లి మందుకు కొనాల్సి వచ్చింది. ఇటీవలి వరకు మందులను డిస్పెన్సరీలోనే ఇచ్చేవారు. మరి ఇప్పుడెందుకిలా.. అదే ప్రైవేటీకరణ మాయ...!!! 

డిస్పెన్సరీల ప్రైవేటీకరణ 
ఆర్టీసీకి హైదరాబాద్‌ తార్నాకలో అన్ని వసతులున్న ఆస్పత్రి, నగరంలో 4 డిస్పెన్సరీలు, పూర్వపు జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున డిస్పెన్సరీలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వరకు తార్నాక ఆస్పత్రిలో ఫార్మసీని ఆర్టీసీనే నిర్వహించేది. కానీ.. మందులకు కొరత, సకాలంలో మందులు అందకపోవడం వంటి కారణాలతో ఫార్మసీని ప్రైవేటీకరించి మెడ్‌ప్లస్‌ సంస్థకు కేటాయించారు. మందులు సమకూర్చడం, కార్మికులకు ఇవ్వడం ప్రస్తుతం ఆ సంస్థే చూస్తోంది. తాజాగా ప్రైవేటీకరణను డిస్పెన్సరీలకూ వర్తింపచేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి లాంటి 4 చోట్ల మినహా మిగిలిన డిస్పెన్సరీలను మెడ్‌ప్లస్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రయోగాత్మకంగా కొన్నింటిని మొదలెట్టారు.  

కార్మికుల గగ్గోలు..  
కానీ మందులను ప్రైవేటు సంస్థ డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉంచడం లేదు. సమీపంలోని తమ మెడికల్‌ షాపులకు అటాచ్‌ చేసి అక్కడే కొనాలని కార్మికులకు సూచిస్తోంది. దీంతో చికిత్సేమో డిస్పెన్సరీల్లో, మందులేమో దూరంగా ఉన్న మెడికల్‌ షాపుల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో ఆస్పత్రికొచ్చే కార్మికులు ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మందులు అందుబాటులో లేకపోతే మరోసారి రావాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు. ముందునుంచి తాము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, డిస్పెన్సరీలు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే ఇష్టారాజ్య నిబంధనలతో కార్మికులను ముప్పుతిప్పలు పెడతాయని, ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకోవాలని ఎన్‌ఎంయూ నేత నాగేశ్వరరావు, ఈయూ నేత రాజిరెడ్డి పేర్కొన్నారు. 

కారణం ఇదేనా..? 
డిస్పెన్సరీలో ఫార్మసీ హక్కులు పొందిన ప్రైవేటు సంస్థ.. మెడికల్‌ షాపును ఏర్పాటు చేయాలంటే ఆర్టీసీకి అద్దె చెల్లించాలి. స్థానికంగా మందులు అందుబాటులో ఉంచినందుకు ఆ సంస్థకు ఆర్టీసీ సర్వీసు చార్జి చెల్లించాలి. కానీ సర్వీసు చార్జి, ఇతర ఖర్చులను వార్షిక వ్యయంలో పొందుపరిస్తే, గతేడాది కంటే ఖర్చులు పెరిగి ఆడిట్‌ అభ్యంతరాలొస్తాయని ఆర్టీసీ ఆందోళన చెందుతోంది. దీంతో అద్దె కోసం ప్రైవేటు సంస్థ, ‘ఆడిట్‌’కోసం ఆర్టీసీ వింతగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలున్నాయి. అయితే.. డిస్పెన్సరీకి కిలోమీటరు పరిధిలోనే మందుల సరఫరా ఉండాలని నిబంధన విధించామని, కానీ ప్రైవేటు సంస్థ దూరంగా ఉన్న సొంత మెడికల్‌ షాపుల్లో కొనాలని చెబుతున్నట్టు తెలిసిందని అధికారులంటున్నారు. కార్మికుల నుంచి ఫిర్యాదులొస్తే ప్రస్తుత విధానాన్ని మారుస్తామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు