రాచకట్ట.. కటకట

21 Apr, 2015 00:34 IST|Sakshi

- పనుల్లో తీవ్ర జాప్యం లక్ష్యానికి దూరంగా
- జలాశయం మిషన్ కాకతీయకు
- ఎంపిక కాని వైనం
- ప్రాధాన్యతను మరిచిన అధికారులు
- కాలువల మరమ్మతుకు
- కానరాని మోక్షం
వినియోగించని నిధులు
రూ.15 లక్షలకుపైగా వెనక్కి
సీఎం నియోజకవర్గంలోనే ఇంతటి అలక్ష్యం
వెల్లువెత్తుతున్న నిరసనలు

 
రాచకట్ట... ఇది గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రధాన రిజర్వాయర్. ప్రవాహానికి నోచుకోకుండానే శిథిలం. జలాశయ ప్రధాన కాలువలు, పిల్ల కాలువల నిర్మాణానికి కానరాని మోక్షం... మరికొన్ని అభివృద్ధి పనుల్లోనూ ఏళ్ల తరబడి జాప్యం...  దశాబ్ద కాలంగా ఎదురుచూపుల్లో అన్నదాతలు... కనీసం మిషన్ కాకతీయకూ ఎంపిక కాని వైనం... సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇంతటి నిర్లక్ష్యం... రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా అధికారుల్లో చలనం శూన్యం.

 - గజ్వేల్
సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రాచకట్ట రిజర్వాయర్‌పై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గానికి ప్రధాన ఆధారభూతమైన కుడ్లేరు వాగుపై జగదేవ్‌పూర్ మండలం రాయవరం-తీగుల్ గ్రామాల మధ్య రాచకట్ట జలాశయాన్ని నిర్మించారు. వందలాది ఎకరాలకు ప్రత్యక్షంగా సాగు నీరు అందించడంతోపాటు జగదేవ్‌పూర్, గజ్వేల్, కొండపాక మండలాల్లో వేలాది ఎకరాల్లో భూగర్భ జలాల పెంపు లక్షయంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. నాబార్డు ద్వారా రూ.394.40 లక్షలతో 2003-04 సంవత్సరంలో పనులు చేపట్టి 2005 ఆగస్టు 19న పూర్తి చేశారు.

రిజర్వాయర్ కుడి కాలువ కింద 700 ఎకరాలు, ఎడమ కాలువ కింద 860 ఎకరాల భూములకు ఆరుతడి పంటలకు సాగు నీరందించాలని లక్ష ్యంగా పెట్టుకున్నారు. కుడి కాలువ ద్వారా రాయవరం, కొడకండ్ల, తిప్పారం, ఎడమ కాలువ ద్వారా హవాయిగూడా, దాత్తర్‌పల్లి, రిమ్మనగూడ, బూర్గుపల్లి గ్రామాలకు ప్రయోజనం కలిగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టు మీదుగా వెళ్లే కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినా మిగతా 20 శాతం పనుల్లో జాప్యం నెలకొంది.

కుడి కాలువ పనులు గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద, ఎడమ కాలువ పనులు రిమ్మనగూడలోని బూర్గుపల్లి రోడ్డువైపు నిలిచిపోయాయి. ఈ కాలువల నిర్మాణం పూర్తయితేనే 1,560 ఎకరాల భూమికి సాగు నీరందే అవకాశముంది. అయితే ఆ పనులు  పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ప్రవాహానికి నోచుకోకుండానే కాలువలు శిథిలమయ్యాయి.

నిధులు వెనక్కి...
రాచకట్ట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల నుంచి రైతుల పొలాలకు నీళ్లు మళ్లించేందుకు వీలుగా పిల్ల కాలువలు నిర్మించాలని నాలుగేళ్ల క్రితం భావించారు. ఇందుకుగాను మూడున్నరేళ్ల క్రితం ఉపాధిహామీ ద్వారా రూ.15 లక్షలకుపైగా నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కూలీలచే పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది.

పనులు చేపట్టడానికి కూలీలు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు పెండింగ్‌లో పెట్టారు. దీనివల్ల నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రాచకట్ట కాలువల  మరమ్మతుకు కలెక్టర్ నిధుల నుంచి మరో రూ.9 లక్షలకుపైగా నిధులు మంజూరయ్యాయి. అయినా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా బీడువారిన పొలాలకు నీరందడం కలగానే మిగిలింది.

‘మిషన్ కాకతీయ’లో తీసుకుంటే ప్రయోజనమే...
దశాబ్దం క్రితం నిర్మించిన రాచకట్ట కుడి, ఎడమ కాలువలు ప్రస్తుతం పూర్తిగా శిథిలమయ్యాయి. పూర్తయిన పనులు వదిలి మిగతా పనులు చేపడితే కొద్ది కాలానికే దెబ్బతిని తిరిగి మొదటికొచ్చే ప్రమాదం ఉంది. కాలువలను కాంక్రీట్ దిమ్మెలతో నిర్మిస్తే తప్ప రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇందుకోసం వ్యయం అంచనాలను పెంచాల్సి ఉంటుంది.

అదే విధంగా రిజర్వాయర్ కట్టను బలోపేతం చేయాల్సి ఉంది. దీంతో రాచకట్ట పూర్తిస్థాయిలో నిండితే రాంనగర్-తీగుల్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్డి ఎత్తు తక్కువగా ఉండటంతో రోజుల తరబడి ఈ రెండు గ్రామాల రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి మార్గం మూసుకుపోతుంది. అందువల్ల ఈ వంతెన ఎత్తు కూడా పెంచాల్సి ఉంది. మరోవైపు కొడకండ్ల వద్ద కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూమికి నష్ట పరిహారం ఇవ్వడంలో, పనుల కొనసాగింపులో ఏళ్ల తరబడి జాప్యం నెలకొంది. ఈ పనులను సైతం వెంటనే పూర్తి చేయాల్సి ఉంది.

సీఎం చెప్పినా...
తన సొంత నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని, ఇందుకోసం ఎన్ని నిధులైనా విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ గతేడాది నవంబర్ 30న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ‘రాచకట్ట’పై నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈలు లక్ష్మీకాంత్, శ్రీనివాసరావులను వివరణ కోరగా... నిజమే ‘మిషన్ కాకతీయ’లో రాచకట్టను చేర్చలేదు. మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

మరిన్ని వార్తలు