తుక..తుక.

18 May, 2014 01:37 IST|Sakshi
తుక..తుక.

మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : కోల్‌బెల్ట్ పరిధిలోని బొగ్గు గనులు తుకతుక మండుతున్నాయి. భానుడు రోజురోజుకూ తన ప్ర తాపం చూపుతుండడంతో మైన్స్‌లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చే యలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్‌బెల్ట్ ఏరియాల్లో 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత రానురాను మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు కొలిమై మండుతున్న కోల్‌బెల్ట్‌ను చూసి భయపడిపోతున్నారు. మొదటి బదిలీ విధులు ముగించుకొని వచ్చే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు గని నుంచి ఇంటికి బయలు దేరుతారు. అదే సమయానికి రెండో బదిలీకి వెళ్లే కార్మికులు సైతం ఇంటి నుంచి గనికి విధులకు వెళ్తారు. ఈ సమయంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింగరేణిలో 15 ఉపరితల, 34 భూగర్భ గనుల్లో 64 వేల మంది కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారు. రోజూ మొదటి, రెండో బదిలీ కార్మికులు 45 వేల మంది వరకు హాజరవుతుంటారు.
 
ఇక్కడే ఉష్ణోగ్రత ఎందుకు ఎక్కువ..

బొగ్గు, దుమ్ము కార్మిక కాలనీల్లో విస్తరించడంతో పరిసర ప్రాంతాలు సాధారణ స్థాయిలో మించి ఉష్ణోగ్రత పెరుగుతుంది. బొగ్గు గనులు విస్తరించడం కోసం అడవులను నరికి వేశారు. దీనికి తోడు జనసాంద్రత పెరిగింది. బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపరితల గనుల్లో ఎండ వేడిమి సాధారణం కంటే అధికంగానే ఉంటుంది. పట్టణాల్లో ఉన్న వేడి కంటే గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోనే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. బొగ్గు ఆక్సీకరణం చెందడంతోనూ ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా నమోదవుతూ ఉంటుంది. ఆక్సీకరణం చెంది మంటలు వ్యాపించిన సందర్భాలు ఉపరితల గనుల్లో ఇప్పటికే నమోదయ్యాయి.
 
 ప్రస్తుత పరిస్థితి..
 ఎండ వేడిని తట్టుకోలేక కార్మికుల హాజరు శాతం ఉపరితల గనుల్లో కొంత మేరకు తగ్గుతోంది. ఉదయం పది గంటల వరకే ఉష్ణోగ్రత 38 డి గ్రీలు నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 డిగ్రీలు దాటుతుండడంతో కార్మికులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు సెలవులను వినియోగించుకుంటున్నారు.
 
 నివారణ చర్యలు చేపడుతున్నా..
 ఉపరితల గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపరితల గనుల్లోని బొగ్గు పొరలు వేడెక్కకుండా ఉండేందుకు అధికారులు బొగ్గు బెంచీలను నీటితో నింపుతున్నారు. నీరు లభించని గనుల్లో బొగ్గు పొరలను మట్టితో కప్పేస్తున్నారు. ఉపరితల గనుల దారుల్లో స్పింకర్ల ద్వారా నీటిని సైతం చల్లిస్తున్నా వేడిమి మాత్రం తగ్గడం లేదు.
 
 సింగరేణి ఏం చేసింది..

 భూగర్భ, ఉపరితల గనులతోపాటు సింగరేణి కాలనీల్లో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతను అడ్డుకునేందుకు యాజమాన్యం మొక్కలను నాటింది. గనులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో అవి విస్తారంగా పెరిగి చల్లని ప్రదేశాలుగా మారాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా 2002లో అటవీ శాఖను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1872.5 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల నీలగిరి, వెదురు, కానుగ తదితర మొక్కలను యాజమాన్యం నాటింది.

కొత్తగూడెం ఏరియాలో 240, ఇల్లందు ఏరియాలో 115, మణుగూరు ఏరియాలో 40, ఆర్‌జి-1 ఏరియాలో 502.50, ఆర్‌జి-2 ఏరియాలో 115, ఆర్‌జి-3 ఏరియాలో 95, భూపాలపల్లి ఏరియాలో 260, శ్రీరాంపూర్ ఏరియాలో 215, బెల్లంపల్లి ఏరియాలో 205, మందమర్రి ఏరియాలో 85 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల మొక్కలను నాటించింది. అయితే.. బొగ్గు నిక్షేపాలు పూర్తయిన గనుల  వద్ద మరిన్ని మొక్కలను నాటి పెంచడానికి కృషి చేయాలి. ఇంకా పలు కాలనీల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుని మొక్కలు పెంచితే ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు