కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు: సునీల్‌ శర్మ

26 Nov, 2019 02:03 IST|Sakshi

సమ్మె చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ చెప్పలేదు

ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం కుదరదు

 సమ్మెపై కార్మికశాఖ కమిషనర్‌ నిర్ణయం తీసుకుంటారు

అప్పటి వరకు కార్మికులు సంయమనం పాటించాలి

ఆర్టీసీపై సీఎం సమీక్ష అనంతరం సునీల్‌శర్మ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రకటించారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం సునీల్‌శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. 

సమ్మె చేయాలని ప్రభుత్వం చెప్పలేదు..
‘ఓ వైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. ఇష్టమొచ్చినప్పు డు విధులకు గైర్హాజరై, మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ ఉండదు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సమ్మె చేయాలని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించా రు. కార్మికులు ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు’ అని సునీల్‌శర్మ తేల్చి చెప్పారు. 

అంతా చట్టప్రకారం జరుగుతుంది..
‘హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషనర్‌ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడు తుంది. అంతా చట్ట ప్రకారం జరుగుతుంది. అప్పటివరకు అంతా సంయమనం పాటించాలి. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. వారంతట వారుగా సమ్మెకు దిగి ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు’అని సునీల్‌శర్మ పేర్కొన్నారు. 

తాత్కాలిక సిబ్బందిని అడ్డగిస్తే క్షమించం..
‘కార్మికులు యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇకపై కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. మం గళవారం డిపోలవద్దకు వెళ్లి శాంతిభద్రతల సమస్యలు సృష్టిం చొద్దు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవద్దని కోరుతున్నా. డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తాం. ఎవరైనా చట్టాన్నిఉల్లంఘిస్తే ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం క్షమించదు. చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేస్తాం. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నా’అని సునీల్‌ శర్మ కార్మికులకు సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా