మెదక్ ఎంపీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?

23 Aug, 2014 15:36 IST|Sakshi
మెదక్ ఎంపీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?

హైదరాబాద్:మెదక్ లోక్ సభ స్థానానికి సెప్టెంబర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సునీతా లక్ష్మారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఆ స్థానం నుంచి అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేసిన అనంతరం సునీతా లక్ష్మారెడ్డినే ఎన్నికల బరిలోకి దింపాలని టీపీసీసీ భావిస్తోంది. శనివారం హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యహహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ టీపీసీసీ నేతలతో గాంధీభవన్‌లో మంతనాలు జరిపారు. తొలుత జగ్గారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా.. లక్ష్మారెడ్డి వైపే కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ తో సమావేశమయ్యారు.

ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని తెలంగాణలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కు పునరుత్తేజం తేవాలని హైకమాండ్ భావిస్తోంది. దీనిపై ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇంతకుముందు బుధవారం నగరంలోని ఒక హోటల్ సమావేశమైన కాంగ్రెస్ నేతలు దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి దిగ్విజయ్ అందజేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను మాత్రం టీపీసీసీ ఇంకా వెల్లడించలేదు.ఇంకా రెండురోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్న దిగ్విజయ్ పార్టీ పటిష్టత సదస్సుపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు