చెట్టు కిందే గొత్తికోయ మహిళ ప్రసవం

28 Sep, 2016 00:38 IST|Sakshi
కావడిలో మోసుకొస్తున్న గొత్తికోయలు

* కవలలు జననం.. ఒకరు మృతి.. చికిత్స పొందుతున్న మరొకరు
* రోడ్డుమార్గం లేక ఆస్పత్రికి చేరుకోలేకపోయిన గర్భిణి

ఏటూరునాగారం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రోడ్డుమార్గం లేక కావడిపై మోసుకొస్తుండగా.. నడిరోడ్డుపైనే ఓ చింతచెట్టు కింద ప్రసవించిన ఘటన మంగళవారం జరిగింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం పరిధిలోని లింగాపురం గొత్తికోయగూడేనికి చెందిన మాడవి పోసమ్మకు మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. గూడేనికి సరైన రోడ్డు లేక 108, ఇతర వాహనాలు కానీ వచ్చే పరిస్థితి లేదు.

దీంతో భర్త భద్రయ్యతో పాటు మరికొందరు మంచానికి తాళ్లు కట్టి పోసమ్మను మోసుకుం టూ 2 కి.మీ. దూరం వచ్చారు. అప్పటికే ఓ ఆటోను పిలిపించారు. కానీ, ఆ ఆటో కూడా మార్గమధ్యలో బురదలో కూరుకుపోయింది. అంతా కలసి ఆటోను బయటకు లాగినా.. పోసమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో గోగుపల్లిలోని ఓ చింత చెట్టుకింద నిలిపివేశారు. దీంతో ఆ చెట్టు కిందే స్థానిక మహిళలంతా కలసి చుట్టూ చీరలు కట్టి.. తమకు తెలిసిన విధంగా పురుడు పోశారు.

పోసమ్మకు ఇద్దరు మగ శిశువులు జన్మించగా, అందులో ఒక బాబు మృతి చెందాడు. గోగుపల్లి సబ్‌సెంటర్ ఏఎన్ ఎం ధనలక్ష్మీ ఈ నెల మొదటి వారంలోనే గొత్తికోయగూడేనికి వెళ్లి పోసమ్మను సామాజిక ఆస్పత్రిలో చేరాలని సూచించింది. అరుునా, ఆమె వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోసమ్మకు రక్తస్రావం అవుతుండడంతో గోగుపల్లి నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. అనార్యోగంతో ఉన్న మరో బిడ్డను పిల్లల ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు