అమృతను చట్టసభలకు పంపాలి

19 Sep, 2018 03:17 IST|Sakshi
అమృతను పరామర్శిస్తున్న పలు పార్టీల నేతలు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ భార్య అమృతను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ.మాస్‌ చైర్మన్‌ కంచె ఐలయ్య ప్రతిపాదించారు. మంగళవారం మిర్యాలగూడలో ప్రణయ్‌ నివాసంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్‌ భార్య అమృత, తల్లిదండ్రులను పరామర్శించారు. కుల దురహంకారానికి ప్రణయ్‌ బలయ్యాడని, ఈ హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అమృతను చట్టసభలకు పంపాలన్నారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ తరఫున మిర్యాలగూడ శాసనసభ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే సీఎం కనీసం ప్రకటన కూడా చేయలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించడానికి రాలేదని ఆరోపించారు. ఈ హత్యలో ఆరోపణలెదుర్కొంటున్న  కాంగ్రెస్‌ నేతలను పార్టీని సస్పెండ్‌ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్‌ చేయలేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతరపార్టీ నేతలు మజీదుల్లాఖాన్, జాన్‌వెస్లీ,  తదితరులు ఉన్నారు. మారుతీరావును ఎన్‌కౌంటర్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఢిల్లీలో డిమాండ్‌  చేశారు.

మరిన్ని వార్తలు