పాలన చేతకాకనే ప్రతిపక్షాలపై విమర్శలు

27 Oct, 2018 12:17 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి 

సాక్షి, షాద్‌నగర్‌రూరల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పాలన చేత కాలేదు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. అభివృద్ధి పనులు చేపట్టలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌లో టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే అభివృద్ధి జరగడం లేదని సీఎం కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ ప్రాజెక్టు పనులను ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే డబుల్‌ బెడ్‌ రూం, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఉచిత విద్యా, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, స్ధానిక యువతకు  ఉద్యోగ అవకాశాలు, మైనార్టీ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 63 సీట్లను గెలిచిన టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం వంద మంది ఎమ్మెల్యేలు ఏవిధంగా వచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో లక్షా 26వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో 8వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. దీంతో సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికీ నాలుగు సార్లు డీఎస్సీ వేశారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీని కూడ వేయలేదని విమర్శించారు. ఎన్నికల సందర్బంగా 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని కేసీఆర్‌ చెప్పారని, ఆయన సభల మాటేమిటో గానీ టీఆర్‌ఎస్‌ అసమ్మతి వర్గం వారు ఇప్పటికే వంద సభలను నిర్వహించారని అన్నారు.

కాంగ్రెస్‌ వారు ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ అభివృద్ది పనులు చేపట్టేందుకు పక్కన ఉన్న ఆరు రాష్ట్రాల బడ్జెట్‌ కూడ ఇక్కడ సరిపోదని చెప్పాడని అన్నారు. కాంగ్రెస్‌ రూపొందించిన పథకాలకు అదనంగా కొంత మొత్తాన్ని కలిపి హామీలను ప్రకటించిన కేసీఆర్‌ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రావుల ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో పనిచేసే నాయకులనే గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. నాలుగున్నరేళ్ల  టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు ఎంతో మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలన్నారు

మరిన్ని వార్తలు