ఏ స్థానం అడుగుదాం..

22 Sep, 2018 12:16 IST|Sakshi
ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమైన జిల్లా టీడీపీ నేతలు మండవ, అన్నపూర్ణమ్మ తదితరులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : మహాకూటమి పొత్తు లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు అడగాలనే అంశంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ప్రాథమికంగా సమాలోచనలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఈ అంశంపై ఉమ్మడి జిల్లాకు చెందిన కొద్ది మంది నాయకులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక స్థా నం టీడీపీకి కేటాయించాలని కోరుతూ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్, బాన్సువాడ, బోధన్‌ స్థానాల్లో ఏ స్థానాన్ని అడగాలనే అనే అంశం చర్చకొచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి బాల్కొండ స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది.

అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ గుర్తు సైకిల్‌పై పోటీ చేస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లు తమవైపు మళ్లే అవకాశాలు లేవని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి.., కాంగ్రెస్‌ గుర్తు నుంచే పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు అనుచరవర్గం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపడం గమనార్హం. కాగా ఇదంతా సాధారణ సమావేశమేనని, పొత్తుల గురించి అసలు ప్రస్తావన రాలేదని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు. ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, కొడాలి రాము, రమాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు