ఐటీ గ్రిడ్స్‌ డేటా కుంభకోణంలో మరో మలుపు

3 Mar, 2019 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్ డేటా కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్‌ గుట్టును బట్టబయలు చేయడంతో ఏపీ సర్కార్‌ వాస్తవాలు కప్పిపుచ్చేందుకు పోలీసులను ఉపయోగిస్తోంది. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఏపీ పోలీసులు ఆదివారం భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ...లోకేశ్వర్‌ రెడ్డిని సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయానికి తరలించారు. చదవండి...(ఐటీ గ్రిడ్‌ కంపెనీలో సోదాలపై టీడీపీలో వణుకు)

మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ సంస్థలో పని చేస్తున్న తమ నలుగురు సహచరులు కనిపించడం లేదంటూ సహ ఉద్యోగి అశోక్‌ ...హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థ ఉద్యోగులు  రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదంటూ..‌. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీ, సైబర్‌క్రైం వింగ్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీకి సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవరకు వెళ్లింది. 

కాగా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక డేటాను సేకరించినట్టు తెలుస్తోంది. డేటా చోరీ వెనుక టీడీపీకి చెందిన పలువురి హస్తం ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాల దగ్గర అత్యంత భద్రంగా ఉండాల్సిన డేటా... బయటికి ఎలా లీక్‌ అయ్యిందనే అంశంపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్‌కు ఈ డేటా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే డేటా చోరీ వ్యవహారంలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హస్తం ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధార్‌తో సంబంధం ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ద్వారానే డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సేకరించినట్లు సమాచారం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ద్వారా ఈ డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు అందజేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు