జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు

27 Jun, 2014 23:34 IST|Sakshi
జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు

రహమత్‌నగర్:  బియాస్ నదిలో గల్లంతైన జగదీష్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం రహమత్‌నగర్‌కు చేరుకోగా, సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, జగదీష్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా బోరుమని విలపించారు. రోదనలు మిన్నంటాయి.  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంబులెన్సులో జగదీష్ భౌతిక కాయాన్ని రహమత్‌నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న అతడి ఇంటికి తీసుకొచ్చారు. పదహారు రోజులుగా కడసారి చూపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న అతడి తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది.
 
పలువురు ప్రముఖులు జగదీష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు మురళీగౌడ్, ఎంఐఎం నాయకుడు నవీన్ యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ ప్రపుళ్లరెడ్డి, కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ భవాని శంకర్, బీజేపీ నగర ప్రచార కార్యదర్శి కొలన్ సత్యనారాయణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ప్రహ్లాద్, టీఆర్‌ఎస్ నాయకులు భాస్కర్ సాగర్, నరసింహ, సత్యనారాయణ, పీఎల్ ప్రకాశం, వైఎస్సార్ సీపీ నాయకుడు షేక్ షమీమ్, జేఎల్ మేరి, ఎమ్మార్పీఎస్ నాయకుడు అరుణ్ హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సందర్శన చివరి క్షణంలో వాయిదా పడింది. సాయంత్రం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జగదీష్ అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని వార్తలు