అసమానతల్లేని తెలంగాణ!

22 Dec, 2018 03:02 IST|Sakshi

     అసమానతల తగ్గింపులో నూరు శాతం లక్ష్యం సాధించిన రాష్ట్రం 

     భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి–2018 నివేదికలో వెల్లడి 

     16 అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు స్కోర్‌ కేటాయించిన నీతిఆయోగ్‌ 

     61 స్కోర్‌తో 5వ స్థానంలో తెలంగాణ

సాక్షి, న్యూఢిల్లీ: అసమానతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నీతిఆయోగ్‌ విడుదల చేసిన భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి–2018లో ఈ విషయం వెల్లడైంది. అసమానతలు తగ్గించడం అనే లక్ష్యంలో రాష్ట్రం నూటికి నూరు శాతం స్కోర్‌ సాధించింది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు–2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా నీతిఆయోగ్‌ ఈ నివేదికను రూపొందించింది. మొత్తం 16 అంశాల ప్రాతిపదికన స్కోరు కేటాయించింది. వివిధ స్కోర్ల ఆధారంగా రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్‌)గా, 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు(పర్‌ఫార్మర్‌)గా, 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస(ఫ్రంట్‌ రన్నర్‌)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు(అచీవర్‌)గా విభజించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు క్రియాశీలురు కేటగిరీలో నిలిచాయి. 29 రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో కేరళ(69), హిమాచల్‌ ప్రదేశ్‌(69), తమిళనాడు (66) నిలవగా.. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు 64 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉన్నాయి. 61 స్కోరుతో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చంఢీగఢ్‌(68), పుదుచ్చేరి(65) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అసోం(49), బిహార్‌(48), యూపీ(42) చివరి స్థానాల్లో ఉన్నాయి. దేశ సగటు స్కోరు 57గా నమోదైంది. కేటగిరీవారీగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలివీ... 

ఆశావహులు: అసోం, బిహార్, యూపీ 
క్రియాశీలురు: తెలంగాణ, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రా నగర్‌ హవేలీ, డయ్యూడామన్, ఢిల్లీ, లక్షద్వీప్‌ 
ముందువరుస: హిమాచల్‌ప్రదేశ్, కేరళ, తమిళనాడు, చండీగఢ్, పుదుచ్చేరి 
సాధకులు: ఏ రాష్ట్రమూ లేదు.

మరిన్ని వార్తలు