తెలంగాణ అప్రమత్తం! 

6 Aug, 2019 03:14 IST|Sakshi

కేంద్ర హోం శాఖ, నిఘావర్గాల హెచ్చరికలు 

జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్‌ 

హైదరాబాద్‌లో పలుచోట్ల కశ్మీరీల నిరసన 

సాక్షి, హైదరాబాద్‌: కశ్మీర్‌లో అధికరణ 370, అధికరణ 35ఏ రద్దు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ, నిఘా వర్గాల సమాచారం మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హై అలర్ట్‌ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం అందుకు తమ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల అనుమతి లేకుండా ర్యాలీలు తీసేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధికరణ 370 రద్దు ప్రకటనకు ముందే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల ను కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రకటన అనంతరం కేంద్ర హోం శాఖ వర్గాలు అధికారికంగా తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశాయి. 

ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కాన్ఫరెన్స్‌.. 
కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో తగిన సూచనలు చేశారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సైబర్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, టీఎస్‌ఎస్పీ పోలీసులతోనూ డీజీపీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఇన్‌స్పెక్టర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఉద్రిక్తతలు తొలగి సాధారణ వాతావరణం వచ్చేంత వరకు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సున్నితప్రాంతాలు అధికంగా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు