భూములపై అసెంబ్లీలో గందరగోళం

24 Nov, 2014 15:39 IST|Sakshi

భూకేటాయింపులపై  తెలంగాణ అసెంబ్లీలో గందరగోళంతో చెలరేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తర్వాత స్పీకర్ టీడీపీకి అవకాశం ఇవ్వగా.. రేవంత్రెడ్డి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, క్షమాపణలు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతారంటూ టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం చెలరేగడం, ఎంత ప్రయత్నించినా సభ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ సర్కారు తప్పు చేసిందని ఎక్కడా అనలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు బహిరంగ వేలం వేయగా, ఆ వేలంలో డీఎల్ఎఫ్ మాత్రమే పాల్గొందని ఆయన చెప్పారు. ఆరోపణల్లో అబద్ధాలు ఉన్నాయని మాత్రమే తాను అన్నానని, స్పీకర్ ఆదేశిస్తే మొత్తం ఫైళ్లన్నీ సభ ముందు పెడతానని కేసీఆర్ తెలిపారు. సాధారణంగా ఎవరూ నోట్ఫైళ్లను సభ ముందుకు తీసుకురారని, కానీ స్పీకర్ అడిగితే వాటిని కూడా సభముందు ఉంచుతానని చెప్పారు.

ఏపీఐఐసీ చేసిన పొరపాట్ల వల్ల లోపాలు జరిగాయని అన్నానని, ఓ మంత్రి రాసిన నోట్ఫైల్ సభ ముందు పెట్టడం సభ్యత కాదని తెలిపారు. పూర్వాంకర్ అనే సంస్థ ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిందని, నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో లోపం వల్లే ఈ భారం పడుతోందని చెప్పారు. వాళ్ల వాదన నెగ్గితే వడ్డీతో కలిపి రూ. 900 కోట్లు కట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల మనసు గాయపడేలా ఒక్క మాట కూడా మాట్లాడబోనని, అయితే భట్టివిక్రమార్క చెప్పినట్లుగా సభా నాయకుడిగా సంయమనం పాటించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని కేసీఆర్ వివరించారు.

మరిన్ని వార్తలు