సభకు నమస్కారం!

7 Mar, 2015 08:24 IST|Sakshi
సభకు నమస్కారం!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. 17 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ
 
 సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ అంశాలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, హామీల అమలులో జాప్యం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం వంటి వాటిపై రాజకీయపక్షాలన్నీ ఇప్పటికే భగ్గుమంటున్నాయి. దీంతో శనివారం నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాలు 17 రోజుల పాటు వాడివేడిగా సాగనున్నాయి. గత సమావేశాల సమయంలో రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలే అయినందున సభలో ప్రస్తావించేందుకు పెద్దగా అంశాలేవీ లేక విపక్షాలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. కానీ ఇప్పు డు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వంపై ఎక్కుపెట్టడానికి వాటి చేతిలో అనేక అస్త్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, బీజేపీ శాసనసభాపక్షాలు ఇప్పటికే సమావేశమై చర్చించుకోగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేసుకోనున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలన్న ప్రతిపాదన, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు, పది మాసాల కాలంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు అధికారపక్షం గణాంకాలతో సిద్ధమవుతోంది. కాగా, 11వ తేదీన రాష్ర్ట ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. తొలిరోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
 
 ఫిరాయింపులపై గర్జన
 
 కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయా పార్టీల నే తలు పట్టుదలగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్    ఈసారి మంత్రిగా సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన రాజీనామా వ్యవహారం అధికారపక్షానికి తల నొప్పిగా మారే అవకాశముంది. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అధికారపక్షం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందన్న అంశం ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. ఎమ్మెల్యే పదవికి మంత్రి తలసాని చేసిన రాజీనామాను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపైనా సభలో దుమారం రేగే అవకాశముంది. అలాగే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనుకోవడం, అక్కడి చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు మార్చాలన్న ప్రతిపాదనలను దాదాపు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలూ చేశాయి. ఈ విషయంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒకే మాటపై నిలబడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే సభలో సమన్వయంగా వ్యవహరించాలని భావిస్తున్నాయి. ప్రస్తుత సచివాలయంలో సకల సదుపాయాలు ఉన్నప్పటికీ వాస్తు పేరుతో దాన్ని ఎర్రగడ్డకు మార్చాలనడంపై బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.
 
 హామీలేమయ్యాయి?
 
 రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన వేతన సవరణ స్కేళ్లకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువడకపోవడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతభత్యాలను అమలు చేస్తామన్న హామీని పట్టించుకోకపోవడంపై సర్కార్‌ను విపక్షాలు నిలదీసే అవకాశముంది. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలైన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడం, ఎస్సీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం కూడా ప్రస్తావనకు రానుంది. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతల వ్యవహారం దుమారం రేపనుంది. ఇక రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ అంశం మరోసారి చర్చకు కానుంది. డిప్యూటీ సీఎంగా పనిచేసిన డాక్టర్ రాజయ్యను అవినీతి ఆరోపణలపై బర్తరఫ్ చేసిన విషయాన్నీ లేవనెత్తేందుకు విపక్షాలు కాచుక్కూర్చున్నాయి.
 
 
 పక్కా వ్యూహంతో అధికారపక్షం సిద్ధం
 
 విపక్షాలకు అవకాశమివ్వకుండా మంత్రులు సన్నద్ధంగా సభకు హాజరుకావాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో సిద్ధంకావాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను వివరించడం ద్వారా విపక్షాల నోళ్లు మూయించాలని సర్కారు భావిస్తోంది. ‘ధీటుగా స్పందిస్తాం. సరైన సమాధానాలతో తిప్పికొడతాం. గత సమావేశాల్లో మాదిరిగానే పైచేయి సాధిస్తాం. విపక్షాలే ఆత్మరక్షణలో ఉన్నాయి’ అని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, అమరవీరుల కుటుంబాలకు సాయం తదితర అంశాలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈసారి మంత్రివర్గంలో పలువురు సీనియర్లు చేరడం కూడా కలిసిరానుంది. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సమర ్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ విప్‌తోపాటు ముగ్గురు విప్‌లు, అయిదుగురు పార్లమెంటరీ కార్యదర్శులనూ రంగంలోకి దించి సభను సమర్థంగా నిర్వహించే వ్యూహంతో ఉంది.
 
 రెండు అసెంబ్లీల్లో ఒకేరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం
 
 తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. పక్కపక్కనే రెండు అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు పోలీసులకు సవాలుగా మారాయి. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులను మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రవేశమార్గాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వీక్షించేందుకు సందర్శకులను అనుమతించరు.  గ్యాలరీ లోకి కూడా పరిమిత సంఖ్యలోనే పాసులు జారీచేయాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 8.55 గంటలకు ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తరువాత 11 గంటలకు తెలంగాణ ఉభయసభల్లో ఆయన ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రెండు రాష్ట్రాల ఉభయసభలు సోమవారానికి వాయిదా పడతాయి.

మరిన్ని వార్తలు