‘మేడిగడ్డపై అడ్డగోలు మాటలు’

22 Sep, 2019 12:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి భౌగోళిక, నీటి అవసరాలపై అవగాహన లేదని మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసమే అప్పులు తీసుకువచ్చామని, కాంగ్రెస్‌ విమర్శలు అర్ధరహితమని అన్నారు. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సైతం అప్పుల బాట పట్టిన విషయం గుర్తెరగాలని హితవు పలికారు. అవసరమైతే తమ ప్రభుత్వం మళ్లీ రుణాలు సేకరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పోలిస్తే టీఆర్‌ఎస్‌ పాలన వంద రెట్లు మెరుగ్గా ఉందని అన్నారు. నైతికత విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అసవరం లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారని, ముగిసిన విలీన ప్రక్రియపై గాలి పిటిషన్‌లు వేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ను బలహీనపరచాలని చీలికలను కాంగ్రెస్‌ ప్రోత్సహించలేదా అని నిలదీశారు. 54 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేశారమని మండిపడ్డారు. పథకాల పేర్లు మార్చినా ప్రజల తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. త్యాగాల పునాదులపైనే టీఆర్‌ఎస్‌ పుట్టిందని చెప్పారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్‌, బీజేపీ సీట్లు తగ్గాయని అన్నారు. ఎల్లుండే అధికారంలోకి వచ్చేలా బీజేపీ హడావిడి చేస్తోందని అన్నారు.

మరిన్ని వార్తలు