ఏ నిమిషానికి ఏమి జరుగునో?

23 May, 2019 03:05 IST|Sakshi

లోక్‌సభ ఫలితాలపై కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌

ఆశించినన్ని సీట్లు రాకుంటే పార్టీ భవిష్యత్‌ కష్టమే

మళ్లీ వలసలు షురూ అవుతాయని ముఖ్యనేతల్లో ఆందోళన

కనీసం 3,4 స్థానాల్లో గెలవకపోతే కష్టమేనని అభిప్రాయం

బీజేపీతో ఓట్లు, సీట్లలో పోటీపడుతున్న హస్తం పార్టీ

పోటీచేసిన ప్రముఖుల రాజకీయ భవిష్యత్తుపైనా నీలినీడలు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఫలితాలు వెల్లడవుతున్న వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలయింది. పోలింగ్‌ జరిగిన నెలన్నర రోజుల తర్వాత వస్తున్న ఫలితాలు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఈసారి పార్టీ ప్రముఖులు బరిలో ఉండడం, ఈ ఫలితాల ఆధారంగానే పార్టీలో సమూల మార్పులుంటాయనే సంకేతాలు ఇప్పటికే రావడం ఈ ఆందోళనకు కారణం. ప్రతికూల ఫలితాలు వస్తే మళ్లీ వలసలు షురూ అవుతాయేమోననే సందేహం పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో గురువారం రానున్న ఫలితాలపై గాంధీభవన్‌ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయోననే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కనీసం 3,4 చోట్ల గెలిస్తేనే..
ఈ లోక్‌సభ ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆ పార్టీ నేతలే బహిరం గంగా వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి బీజేపీకి కూడా మంచి ఓటింగ్‌ జరిగిందని, కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి. ఎన్డీయేకే మళ్లీ అధికారం వస్తుందన్న పోస్ట్‌పోల్‌ సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్‌లో గుబులురేపుతున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కూడా కష్టమేననే చర్చ జరుగుతోంది.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 3–4 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటేనే తెలంగాణలో పార్టీ బతికే పరిస్థితి ఉంటుందని, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చినా, లేదంటే అంతకంటే తక్కువ వచ్చినా పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుం దని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే మళ్లీ వలసలు మొదలవుతాయని.. ఆ వలసలు ఎంత దూరం వరకు వెళ్తాయో కూడా తెలియదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా పార్టీ 3,4 సీట్లు గెలుచుకుని మిగిలిన చోట్ల కనీస ప్రదర్శన కనబరిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

పెద్దోళ్ల పరిస్థితి ఏంటో?
పార్టీతోపాటు.. రాష్ట్ర పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన కొందరు నాయకుల భవిష్యత్తును కూడా ఈ ఫలితాలు నిర్దేశించ నున్నాయి. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌ లాంటి ప్రముఖులంతా ఈసారి బరిలో ఉండడంతో వీరి భవిష్యత్తు గెలుపోటములపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫలితాలను బట్టి పార్టీలో కూడా మార్పులుంటాయని, ప్రజాదరణ పొందిన నేతలకే పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నేపథ్యంలో ఈ నేతల్లో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది గంటల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీలోని కీలక నేతల భవిష్యత్తు తేలనుంది.

మరిన్ని వార్తలు