ప్రచారంలో దూకుడు

25 Sep, 2018 13:11 IST|Sakshi

ప్రచారంలో ‘కారు’ దూసుకుపోతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ తమకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు సైతం దాదాపు ఖరారవడంతో ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ రేసుగుర్రాలను ఇంకా ప్రకటించకపోవడంతో నేతలు ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టలేదు. పొత్తుల నేపథ్యంలో తమ సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందేమోనని కొందరు ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’ ప్రచారం ఊపందుకుంటోంది. గులాబీ గుర్రాలు కదనరంగంలోకి దూకగా.. కాంగి‘రేసు’ ఇంకా మొదలు కాలేదు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో మాత్రం ‘కమలం’ వికసిస్తోంది. శాసనసభను రద్దు చేసిన రోజే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల నగారా మోగించడంతో టీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ మాత్రం పొత్తులు..ఎత్తులతోనే కాలయాపన చేస్తోంది. విపక్షాలన్నీ మహాకూటమిగా బరిలో దిగాలని నిర్ణయించిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. కనీసం సీట్ల సంఖ్యపై కూడా స్పష్టత కనిపించడం లేదు. దీంతో ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. పొత్తులు ఎవరి సీట్లకు ఎసరు తెస్తాయోననే ఆయా పార్టీల అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.

ఇది కాస్తా నేతలను ప్రచార క్షేత్రంలోకి వెళ్లకుండా నిలువరిస్తోంది. ప్రచారపర్వంలో అధికారపార్టీ దూకుడు కొనసాగుతున్నా.. దానికి బ్రేకులు వేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. సీట్లు తేలకపోవడంతో హేమాహేమీలు సైతం ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా సన్నిహితులతో మంతనాలకే పరిమితమవుతున్నారు. టికెట్లు ఖరారైతే తప్పా ముందడుగు వేసే వాతావరణం సీనియర్లకు లేకపోగా.. సీట్ల పంపకంపై స్పష్టత వస్తే తప్పా ప్రచారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లే పరిస్థితి ఆశావహులకు లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ఎన్నికల శంఖారావం ఇంకా పూరించలేకపోతున్నాయి.

జెట్‌ స్పీడులో కారు..   
ప్రచారంలో కారు జోరు కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాలు మినహాయించి మిగతా సెగ్మెంట్లకు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించడంతో గులాబీ దళం క్షేత్రస్థాయి ప్రచారంలోకి వెళ్లింది. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సొంత నియోజకవర్గం తాండూరులోనే మకాం వేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమవుతూ మరోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డి కూడా కొడంగల్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఓడించి సంచలనం నమోదు చేయాలని భావిస్తున్న నరేందర్‌.. నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఇబ్రహీంపట్నం సిట్టింగ్‌ శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అచ్చొచ్చిన నందివనపర్తి నుంచి ఆయన ప్రచార భేరీని మోగించారు. మేజర్‌ పంచాయతీల్లో ధూంధాం కార్యక్రమాలతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరికి చేర్చేందుకు యత్నిస్తున్నారు. చేవెళ్ల తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్‌పల్లి, షాబాద్, నవాబుపేట మండలాల్లో తొలిదఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. పరిగిలోని ఆయా మండలాల్లో యువనేత మహేశ్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన సతీమణి ప్రతిమారెడ్డి సైతం నిత్యం ప్రచారం చేస్తూ తన భర్తకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్‌లో మాత్రం ఊహిం చిన స్థాయిలో  ప్రచారం ఊపందుకోలేదు.

లేటయినా.. లేటెస్ట్‌గా 
షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు అసమ్మతి సెగ తగిలింది. టికెట్‌ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్, అందె బాబయ్యను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసి అలసిపోయిన అంజయ్య.. ఎట్టకేలకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రోజుకో ర్యాలీతో అసమ్మతి రాజకీయాలు చేస్తున్న ఇరువురికి చెక్‌ పెట్టేలా భారీగా తరలివస్తునకార్యకర్తలతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. కల్వకుర్తిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ప్రచారాన్ని మొదలుపెట్టినా.. ఇంకా ఊపందుకోలేదు. స్థానిక నేతలు కలిసిరాకపోవడంతో ప్రచారంలో దూకుడును చూపించలేకపోతున్నారు.
  
కమలం జోరు 
షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆచారి, శ్రీవర్ధన్‌రెడ్డి అధికారపార్టీ అభ్యర్థులకు దీటుగా ప్రచారపర్వంలోకి దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆచారి ఈ సారి ఎలాగైనా విజయం ఢంకా మోగించి శాసనసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా టికెట్‌ విషయంలో లైన్‌ క్లియర్‌ చేయడంతో ముందస్తు ప్రచారానికి తెర లేపారు. ముమ్మరంగా గ్రామాలను చుట్టేస్తున్న ఆయన.. తనకు ఓసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు.

షాద్‌నగర్‌లో శ్రీవర్ధన్‌రెడ్డి కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్న ఆయన.. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలను నిలదీస్తూ..ప్రజలను చైతన్యం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీవర్ధన్‌కు.. ఈసారి కూడా టికెట్‌ ఖాయమని బీజేపీ హైకమాండ్‌ సంకేతాలివ్వడంతో ప్రచారం షురూ చేశారు. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఎన్నికల సందడి మొదలు కాలేదు.

మరిన్ని వార్తలు