ఉజ్వల భవిష్యత్‌కు బాటలు

3 Jun, 2019 12:03 IST|Sakshi
కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, కలెక్టర్, ఇతర అధికారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఐదేళ్ల స్వపరిపాలనలో రాష్ట్రం ఉజ్వల భవిష్యత్‌ దిశగా అడుగులు వేసిందని శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియం మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప సభాపతి.. జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వేదిక వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి రాచకొండ కమిషనరేట్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పద్మారావు మాట్లాడుతూ... అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కూడా సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలియజేశారు. మరింత అంకితభావం, నీతి నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తే అమరవీరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు.  ప్రజలందరూ సుఖః శాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

సామాజిక భరోసా 
సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకం కింద జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు ప్రతినెలా పింఛన్లు అందజేస్తున్నామని, 1.73 లక్షల మందికి ప్రతినెలా రూ.20.20 కోట్లు ఖర్చుచేస్తున్నామని పద్మారావు చెప్పారు. . కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా గతేడాది ఆరు వేల పేద కుటుంబాలకు రూ.44 కోట్లు అందజేశాం, ప్రతిపేదవాడూ కడుపు నిండా భోజనం చేసేందుకు రూపాయికి కిలో చొప్పున జిల్లాలో 5.24 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొన్నటి విద్యాసంవత్సరంలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, శంకర్‌పల్లి, ఫరూఖ్‌నగర్‌లో ఒకటి చొప్పున కేజీబీవీలను వినియోగంలోకి తెచ్చాం, 243 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 75 వేల మంది విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో విద్యాబోధన చేస్తున్నాం. ఫలితంగా బడుల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా మెరుగుపడిందన్నారు. వసతిగృహాలు, బడుల్లో చదువుతున్న 1.04 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.181 కోట్ల ప్రీమెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలను అందించాం. 16 ఎస్సీ, 9 చొప్పున బీసీ, మైనారిటీ, గిరిజన గురు కులం ద్వారా 11,400 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని పద్మారావు పేర్కొన్నారు.
 
రైతులకు అండగా.. 
రైతుబంధు పథకం కింద తొలి విడతగా 2.47 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.257 కోట్లు అందజేశాం. రబీ సీజన్‌లో 2.18 లక్షల మందికి రూ.237 కోట్లను పెట్టుబడి సాయం కోసం ఖర్చుచేశాం. అలాగే రైతు బీమా పథకం కింద 489 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించి బాసటగా నిలిచాం. రూ.35,200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 350 గ్రామాల పరిధిలోని 3.77 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 24 గంటల విద్యుత్‌ సరఫరా ద్వారా 1.14 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
 
‘రికార్డు’ ప్రక్షాళన 
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వంద రోజుల్లోనే జిల్లాలోని 2.42 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించాం. 81 రోడ్ల మరమ్మతుల పనులు రూ.1,186 కోట్ల వ్యయంతో చేపట్టాం. ముచ్చర్లలోని ఫార్మాసిటీ అనుసంధానం కోసం కందుకూరు నుంచి యాచారం వరకు రూ.146 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు జోరుగా సాగుతున్నా యి. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యం తో 191 గ్రామ పంచా యతీలు, ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశాం. 60 గిరిజన తండాలు గ్రామ జీపీలుగా అవతరించాయి. 418 జీపీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాం. రూ.30 కోట్ల జిల్లా పరిషత్‌ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డ్వాక్రా, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టినట్లు సభాపతి వివరించారు.

ఆర్థిక చేయూత  
గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో తొలివిడతగా జిల్లాలోని 11,277 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. గంగపుత్రులు, ముదిరాజ్‌ల స్వాలంబన కోసం 534 చెరువుల్లో సుమారు కోటి చేప విత్తనాలు వేశాం. మహిళా సాధికారిత కింద ఈ ఏడాది 6,930 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.282 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాం. ఉపాధి హామీ పథకం కింద రూ.112 కోట్లు ఖర్చు చేసి 46 లక్షల పనిదినాలు కల్పించాం. 797 మంది నిరుద్యోగ యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పద్మారావు పేర్కొన్నారు.

లబ్ధిదారులకు అందజేత 
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 9 ప్రభుత్వ శాఖల పరిధిలోని లబ్ధిదారులకు ఉపసభాపతి చేతుల మీదుగా ఆస్తుల పంపిణీ చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 20 స్వయం సహాయక సంఘాలకు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా 13 మందికి ట్రాన్స్‌పోర్ట్‌ హైరింగ్‌ వాహనాలు, హాజింగ్‌ శాఖ తరఫున ఐదుగురికి ఇళ్ల పట్టాలు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురికి వెండింగ్‌ వాహనాలు, ఉద్యానశాఖ ద్వారా ఆరుగురికి డ్రిప్‌ ఇరిగేషన్‌ యూనిట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 20 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్‌చైర్లు, హియరింగ్‌ ఎయిడ్స్, గిరిజన అభివృద్ధి శాఖ తరఫున ఆటోలు, ఫొటో అండ్‌ వీడియోగ్రాఫ్‌ యూనిట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్‌ నిధిని అందజేశారు.

అమరవీరుల కుటుంబాలకు సన్మానం.. 
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఉప సభాపతి పద్మారావు ఓదార్చారు. బిడ్డల త్యాగం ఊరికే పోదని.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబసభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ హరీష్, డీఆర్‌ఓ ఉషారాణి, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు, డీఆర్‌డీఓ ప్రశాంత్‌ కుమార్, డీఈఓ సత్యనారాయణ రెడ్డి ప్రజాప్రతనిధులు తదితరులు పాల్గొన్నారు. 

ఆరోగ్యానికి పెద్దపీట 

కేసీఆర్‌ కిట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకంలో భాగంగా రూ.20.58 లక్షలను అందజేశాం. కంటి వెలుగు కార్యక్రమం కింద 8.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. 2.52 లక్షల మందికి కంటి అద్దాలు అందజేశామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు