హైపర్‌ టెన్షన్‌.. రెండో స్థానంలో తెలంగాణ

17 May, 2018 07:42 IST|Sakshi

మెదక్‌ జిల్లాలో అత్యధికం.. గ్రేటర్‌లో 30 శాతం

నేడు వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే

ప్రపంచ ‘అధిక రక్తపోటు’కు రాజధానిగా దేశాన్ని పిలుస్తుండగా, దేశంలో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో 39 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలు అధికరక్తపోటుతో బాధపడుతుండగా, మెదక్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ ఉన్నట్లు వెల్లడైంది. అయితే చాలా మందికి తమకు అధికరక్త పోటు సమస్య ఉన్నట్లు తెలియదు. తీరా తెలిసే సమయానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఇది గుండె, మూత్ర పిండాలు, మెదడు పనితీరును దెబ్బతీస్తూ.. సైలెంట్‌ కిల్లర్‌గా మారుతోంది. నేడు ప్రపంచ అధికరక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) దినం సందర్భంగా ప్రత్యేక కథనం. 
         – సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌
ఉరుకులు పరుగుల జీవితం.. అతిగా మద్యపానం.. అధిక బరువు.. పని ఒత్తిడి.. కాలుష్యం.. వెరసీ మనిషి ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్‌లో 30 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ లీగ్‌ సౌత్‌ ఏసియా రీజియన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకట్‌ ఎస్‌.రామ్‌ ప్రకటించారు. ఆసక్తికరమైన అంశమే మిటంటే 90 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లు తెలీదు. తెలిసిన వారిలో పది శాతానికి మించి వైద్యులను సంప్రదించడం లేదు. సాధారణంగా నాలుగు పదుల వయసు పైబడిన వారిలో కన్పించే అధికరక్తపోటు సమస్య ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతున్నాయి.

పాతికేళ్లు దాటిన ప్రతి 10 మందిలో 4 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. బాధితుల్లో ఎక్కువ శాతం మార్కెటింగ్, ఐటీ అనుబంధ ఉద్యోగులు ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడంతో కార్డియో వాస్క్యూలర్‌ (హార్ట్‌ ఎటాక్‌), మూత్రపిండాల పని తీరు దెబ్బతినడంతో పాటు చిన్న వ యసులోనే పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లి మతి మరుపు రావడం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

మారిన జీవన శైలి వల్లే.. 
ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికి కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చున్న చోటు నుంచి కనీసం లేవకుండానే అన్ని పనులూ కానిచ్చే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్‌ సంభాషణలు, ఇంటర్నెట్‌ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. గ్రేటర్‌లో పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. హైపర్‌ టెన్షన్‌ బాధితుల్లో 40 శాతం మంది గుండెనొప్పితో మృతి చెందుతుండగా, 25 శాతం మంది కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారు. మరో 10 శాతం మంది పక్షవాతంతో జీవచ్ఛవంలా మారుతున్నారు. 

అధిక రక్తపోటుకు130/80 రెడ్‌ సిగ్నల్‌ 
గతంలో 140/90 ఉంటే హైపర్‌టెన్షన్‌కు రెడ్‌సిగ్నల్‌గా పరిగణించేవారు. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రక్తపోటు నిర్వచనం  మారింది. 130/80 ఉంటే రెడ్‌సిగ్నల్‌గా భావించాల్సిందే. చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల మధుమే హం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం బా రినపడే ప్రమాదం లేకపోలేదు.   
– డాక్టర్‌ సి.వెంకట్‌ ఎస్‌ రామ్, అపోలో  

ఉప్పు తగ్గించడమొక్కటే పరిష్కారం.. 
అధికరక్తపోటు ఉన్నట్లు గుర్తించడం సులభమే. బీపీ వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్‌ చేయించుకోవాలి. పని ఒత్తిడి, ఇతర చికాకులకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానం, దూమపానాలకు దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.    – డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు, నిమ్స్‌  

మరిన్ని వార్తలు