ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..

30 Oct, 2019 01:25 IST|Sakshi

బకాయిల్లేవు.. అదనంగా రూ. 662 కోట్లు ఇచ్చాం

హైకోర్టుకు తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

ఆర్థిక మాంద్యం వల్ల రూ. 47 కోట్లు ఇప్పుడు ఇవ్వలేం

ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు 

ఆ పని కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది

విచారణ వచ్చే నెల  1కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాము ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేమని, బకాయిల కన్నా అదనంగా రూ.622 కోట్లు గత ఆరేళ్లలో చెల్లించామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బకా యిలు చెల్లించేశామని, 2014–15 సంవ త్సరం నుంచి ఇప్పటివరకు రూ.4,253.36 కోట్లు చెల్లించామని, ఇది బకాయిల కంటే అధికమని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ కూడా రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించేసిందని, ప్రభుత్వం అద నంగా చెల్లించిన నేపథ్యంలో ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ కూడా చెల్లిం చాల్సినదేమీ లేదని వెల్ల డించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, సమ్మెచేసే ఉద్యోగుల డిమాం డ్లలో న్యాయ బద్ధమైన వాటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘ వేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డి లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. 

కేంద్రం పరిష్కరించాలి..
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అసలు ఆర్టీసీ విభజన జరగ లేదని, ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఏపీలకు పంపకాల వంటి ఇతర సమస్య లను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్రానికి కూడా ఉందని చెప్పింది. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముందుగానే రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు ఆర్టీసీకి తెలిపారా.. ఇవ్వాల్సింది లేదని కూడా చెప్పారా లేదా అని ప్రశ్నించింది. పైగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల్లేవని చెప్పలేదని, బకాయి ఇవ్వాలన్న ఆర్టీసీ డిమాండ్‌ను ఖండించలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. ముందుగానే డబ్బులు ఇచ్చేశామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నందున ఆర్టీసీకి బకాయిలు రావాల్సినవి ఉన్నాయో లేదో, ఉంటే ఎంత బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలో తెలియజేయాలని ఆర్టీసీ ఎండీని కోర్టు ఆదేశించింది.

నాలుగు ప్రధాన డిమాండ్లకు ఆర్టీసీ విభజన కాలేదు..
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ ప్రకారం ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే ఉందని, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఏజీ చెప్పారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, ఏపీకి 58 శాతం బకాయిల్ని డబ్బు రూపంలో చెల్లించేందుకు అడ్డుంకులు ఏమున్నాయి. ఐదేళ్లుగా కేంద్రం వద్ద ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు’అని ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారమే దీనిపై కేంద్రానికి లేఖ రాశామని ఏజీ జవాబు చెప్పారు. దీంతో ధర్మాసనం కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసింది. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్నందున కేంద్రం ఏం చేయదల్చిందో చెప్పాలని, ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్‌ ప్రకారం వీటి విషయంలో కేంద్ర వైఖరి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్‌ 1న జరుపుతామని పేర్కొంది.

ఆంకెలాట ఆడుతున్నట్లు ఉంది..
ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాల్ని పరిశీలించిన ధర్మాసనం.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెలాట ఆడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బకాయిలు చెల్లించామని చెబుతున్నారే గానీ, బకాయి ఏమీ లేదని చెప్పట్లేదని తప్పుపట్టింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. పూర్తి వివరాలిచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలంటే హైకోర్టు ఇవ్వలేదని చెప్పారు. ‘ల్యాప్‌టాప్‌ క్లిక్‌ చేస్తే పూర్తి వివరాలు అందించే ఈ రోజుల్లో ఆర్టీసీకి ఎంత మేరకు బకాయిలు చెల్లించాలో చెప్పడానికి అంత సమయం ఎందుకు? రూ.4,253 కోట్లు చెల్లించామని చెబుతున్నారు. అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండటాన్ని కూడా డబ్బు ఇచ్చినట్లు ఎలా చెబుతారు? ఆర్టీసీకి అప్పు పుట్టేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఆ అప్పుపై వడ్డీలో కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం చెల్లించదు. అలాంటప్పుడు గ్యారంటీగా ఉన్న మొత్తాన్ని కూడా ఆర్టీసీకి ఇచ్చామని ఎలా చెబుతారు? ఎప్పుడో డబ్బులిచ్చి 2018–19లో చెల్లించాల్సినవి కూడా ఇచ్చామని ఎలా చెబుతారు’అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ప్రజాహితంతో అధికారులు వివరాలిచ్చారని ఏజీ చెప్పగానే.. ధర్మాసనం స్పందిస్తూ.. ‘వివరాలన్నీ వేగ్‌గా ఉన్నాయి. క్లిస్టర్‌ క్లియర్‌గా లేనేలేవు. సూటిగా చెప్పే ప్రయత్నమే కనబడలేదు’అంటూ వ్యాఖ్యానించింది.

బడ్జెట్‌ లెక్కలు చెప్పండి
‘బడ్జెట్‌లో ఆర్టీసీకి 2013–2019 సంవత్సరాలకు ఎంత కేటాయించారు? తాజా బడ్జెట్‌ ఎంత.. ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు. ఇంకా ఎంత బడ్జెట్‌ విడుదల చేయాల్సి ఉందో తెలపండి. ఆర్టీసీ యూనియన్ల ప్రధాన 4 డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన రూ.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో కూడా స్పష్టం చేయాలి’అని కోర్టు పేర్కొనగా.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రూ.47 కోట్లు విడుదల చేసేందుకు సమయం కావాలని ఏజీ చెప్పారు. దీంతో ధర్మాసనం వెంటనే స్పందిస్తూ.. ‘ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు రూ.47 కోట్లు ఇవ్వాలంటే ఆర్థిక మాంద్యమని చెబుతున్నారు. ఆర్టీసీ కూడా ప్రజల కోసమే పనిచేస్తోంది. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకే ఆదాయం సరిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆర్టీసీ లేదా? గిరిజనులు, మహిళలు, పిల్లలు, పేద, మధ్యతరగతి వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్టీసీకి బడ్జెట్‌లో కేటాయించిన రూ.550 కోట్లకు రూ.425 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్టు వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏజీ చెప్పారు.

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..
పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పలుసార్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమంటూనే, ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారంటూ పరస్పర విరుద్ధంగా చెప్పడం ఊసర వెల్లి రంగులు మార్చినట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె విరమించాలని ఆదేశిస్తే కార్మికులు ఏం చేస్తారో.. సమ్మె చట్ట విరుద్ధమంటే ఏమవుతుందో కూడా ఆలోచించాలని హితవు పలికంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై ఆర్టీసీ వైఖరిని తెలిపేందుకు సోమవారం వరకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్‌ కౌన్సెల్‌ శ్రీనివాసన్‌ అయ్యంగార్‌ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు.

కానుకకు జవాబుదారీ ఉంటుందా?
ఆర్టీసీ బకాయిలు ముందుగానే చెల్లించేశామని ప్రభుత్వం చెప్పడంతో ఆ విషయాన్ని ముందుగానే కార్పొరేషన్‌కు చెప్పారా అని ప్రశ్నిస్తూ ‘మీకు నేను రూ.3 లక్షలు అప్పు ఉన్నాను. మీ కుమార్తె వివాహానికి నేను అప్పుతో కలిపి ప్రేమతో రూ.5 లక్షలు ఇచ్చాను. అప్పు పోను మిగిలిన రూ.2 లక్షలు కానుక అనుకుంటారు కదా? మరి ఆ రూ.2 లక్షలకు ఇప్పుడు మీరు జవాబుదారీ అని నేను అంటే ఎలా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా