లండన్ వైద్యులను ఢిల్లీ రప్పిద్దామా?

4 Apr, 2015 01:22 IST|Sakshi
లండన్ వైద్యులను ఢిల్లీ రప్పిద్దామా?

వీణ వాణీల ఆపరేషన్‌పై ఎయిమ్స్‌కు సర్కారు లేఖ
దేశంలోనే శస్త్రచికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలపై ఆరా
ఖర్చు తదితర అంశాలపై వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: వీణ, వాణి అవిభక్త కవలలను వేరు చేసేందుకు లండన్ వైద్యులను మన దేశానికే రప్పించి శస్త్రచికిత్స చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అభిప్రాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు లేఖ రాసింది. లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు వీణవాణిలను విడదీసే శస్త్రచికిత్స చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ.10 కోట్ల మేరకు ఖర్చవుతుందంటూ వారు నివేదిక కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరుతూ వారి నివేదికను కూడా పంపింది.
 ఎక్కడ చేయించవచ్చు?
 ప్రధానంగా మూడు అంశాలపై సర్కారు ఎయిమ్స్ సలహా కోరింది. లండన్ డాక్టర్లను రప్పించడం ఒకటి కాగా.. అలా రప్పిస్తే ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయడానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఉన్నాయా? లేదా తెలపాలని కోరింది. లండన్‌లో చికిత్సకు రూ. 10 కోట్లు ఖర్చయితే.. వారిని ఢిల్లీకి రప్పించి, శస్త్రచికిత్స చేయిస్తే ఎంత ఖర్చవుతుందో సమాచారం ఇవ్వాలని కోరింది. ఇక రెండో అంశం.. అసలు ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయడానికి అవకాశాలు, ఆధునిక వైద్య వసతులు ఏమేరకు ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని కోరింది. మూడో విషయం.. దేశంలో మరెక్కడైనా వీణవాణీలకు శస్త్రచికిత్స చేసే సామర్థ్యం గల ఆసుపత్రులున్నాయా? వైద్యులు ఉన్నారా? అన్న విషయంపైనా వివరాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ మూడింటిలో ఏది అనుకూలమో చెప్పాలని.. శస్త్రచికిత్స విజయవంతమయ్యేలా ఆ సలహాలు ఉండాలని కోరింది.
 
 జాప్యమా.. జాగ్రత్తా..?
 
 వీణవాణీల శస్త్రచికిత్సపై ఎయిమ్స్ సలహా కోరడం మంచిదే అయినా... దేశంలో ఎక్కడైనా చేసే అవకాశం ఉందా? అని సర్కారు అడగడాన్ని పలువురు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. వీణవాణీల ఆపరేషన్‌పై ఏళ్లుగా చర్చ జరుగుతున్న సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు. సింగపూర్ వైద్యులను ఇంతకు ముందు సంప్రదించారని, దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్ వైద్యుల దృష్టిలోనూ ఈ విషయం ఉందని వారు చెబుతున్నారు. అనేక ప్రయత్నాల తర్వాతే లండన్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారని, వారు ఇప్పటికే ఇలాంటి ఆపరేషన్ చేసి విజయవంతమయ్యారని అంటున్నారు. ఇలా ఇన్ని రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ... మళ్లీ ఎయిమ్స్ సలహా అంటూ సర్కారు తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. లండన్ ఆసుపత్రిలో చికిత్స విజయవంతానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరితే చాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ వాదనను కొట్టివేస్తోంది. ఒకటికి పదిసార్లు సరిచూసుకోవడం కోసమే ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరిందని చెబుతోంది.

మరిన్ని వార్తలు