సర్వే షురూ..

24 Apr, 2019 09:06 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే మొదలైంది. వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మే 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వ్యవసాయ అభివృద్ధి, రైతు పథకాల అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నారు. ఏఈఓలు గత సంవత్సరం రైతులు ఏ పంట వేశారు, నేల స్వభా వం, మార్కెటింగ్‌ విధానం, పంట రుణాలు, పనిముట్లు, రైతుల బ్యాంక్‌ ఖాతా, పట్టాదారు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు ఆధార్‌ నంబర్లు సేకరిస్తున్నారు. 39 కాలమ్స్‌తో కూడిన ప్రణాళికను తయారు చేసి రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.

జిల్లాలో 101 క్లస్టర్లు  ఉన్నాయి. 95 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు పనిచేస్తున్నారు. అదేవిధంగా 1లక్ష 18వేల 863 మంది రైతుల వివరాలను సేకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఏఈఓలు ఉదయం, సాయంత్రం వేళల్లో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ప్రారంభించలేదని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి జిల్లాలో సర్వే ప్రారంభమైందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఏఈఓలు ఏ,బీ పార్ట్‌ ప్రకారం రైతుల సమాచారం సేకరించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు.

పార్ట్‌–ఏలో రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతు పేరు, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సర్వే నంబర్‌ వివరాలు, ఆధార్‌కార్డులో ఉన్నవిధంగా రైతు పేరు, తండ్రి లేదా భర్త పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ సంవత్సరం నమోదై ఉంటే జూలై 1ని పుట్టిన తేదీగా పేర్కొంటున్నారు. అదేవిధంగా రైతుబంధు పథకంలో తీసుకున్న సెల్‌ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసుకుంటున్నారు. బ్యాంక్‌ఖాతా, ఐఎఫ్‌సీ కోడ్‌ వివరాలను రైతు బీమాలో పేర్కొన్న ఎల్‌ఐసీ ఐడీ నంబర్‌ నమోదు చేసుకుంటున్నారు. పార్ట్‌–బీలో రైతు విద్య వివరాలు, భూమి సాగుకు యోగ్యమైన వివరాలు, సాగునీటి వసతి, సూక్ష్మ సేద్యం వివరాలు, నేల స్వభావం, భూసారం వివరాలు, ఏయే పంటలకు భూమి అనువుగా ఉంది, వ్యవసాయం యంత్రాల వివరాలు, ఎంత రుణం తీసుకున్నారు, ఏయే సంఘాల్లో సభ్యులు ఉన్నారు, పశుసంపద, సేంద్రియ వ్యవసాయం తదితర వివరాలు సేకరిస్తున్నారు.

మే 20 వరకు ప్రక్రియ..
జిల్లాలోని 18 మండలాల్లో 101 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్‌ ఒక ఏఈఓతో సర్వే చేయిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన 95 మంది ఏఈఓలు ఉండగా, మిగతా వారిని ఆత్మ, హార్టికల్చర్‌ ఉద్యోగుల ద్వారా సర్వే చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మే 20 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుకు ఈ సర్వే ఎంతగానో దోహదపడనుంది. వ్యవసాయ యాంత్రీకరణ, రైతుబంధు, రైతుబీమా, సూక్ష్మసేద్యం, పంట రుణాలు, మద్దతు ధర, ఎరువులకు సబ్సిడీ వంటి పథకాల అమలులో సర్వే కీలకం కానుంది. సమగ్ర సర్వే ఆధారంగానే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు దోహదపడే అవకాశం ఉంది. రైతు పథకాలకు నిధుల కేటాయింపులో ప్రామాణికం కానుంది.

లక్ష 18 వేల మంది రైతులు
జిల్లాలో 1,18,863 మంది రైతులు ఉన్నారు. 2లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. దాదాపు లక్ష 10వేల హెక్టార్ల వరకు పత్తి, 40వేల ఎకరాల్లో సోయా, మిగితా కందులు, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే నెలరోజుల్లో సర్వే పూర్తి కావడం అనుమానంగా ఉంది. ఓవైపు ఎండలు ముదురుతుండటం, మరోవైపు ఏఈఓలకు ఎన్నికల విధులు కేటాయించడంతో పని ఒత్తిడి కారణంగా సర్వేకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సకాలంలో సర్వే పూర్తి చేస్తే రైతులకు మేలు జరగనుంది.

సర్వే ప్రారంభమైంది
జిల్లాలో రైతు సమగ్ర సర్వేను ప్రారంభించాం. 101 క్లస్టర్లలో లక్ష 18వేల మంది రైతుల వివరాలు ఏఈఓలు సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం. – ఆశాకుమారి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా