హరితహారంపై అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపం

7 Aug, 2018 02:12 IST|Sakshi

మొక్కల పెంపకాన్ని అడ్డుకుంటున్న వైనం

జూలైలోనే 1,05,618 మొక్కల తొలగింపు

మొక్కలు నాటేందుకెళ్లే సిబ్బందిపై దాడులు

కబ్జాదారులకు అండగా నిలుస్తున్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు

2014 వరకు జరిగిన కబ్జాల జోలికి వెళ్లొద్దన్న మంత్రి జోగు రామన్న

వాటిని సర్కారు క్రమబద్ధీకరిస్తుందనే అభిప్రాయంతో కొత్తగా ఆక్రమణలు

ప్రభుత్వానికి అటవీ విభాగాధిపతి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోంది. అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు. 2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది.

కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న అటవీ భూములను మళ్లీ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారు.

క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు...
రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తోంది. 2015–19 మధ్య మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 80 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు, మరో 20 కోట్ల మొక్కలను దట్టమైన అడవుల్లో నాటాలని నిర్ణయించింది. మిగిలిన 130 కోట్ల మొక్కలను మైదాన ప్రాంతాల్లో నాటుతోంది. వేల ఎకరాల్లో కబ్జాకు గురైన భూముల్లో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 2,535.7 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చింది. నాటిన మొక్కలను ఎక్కడికక్కడ పీకేస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని, మానవ శ్రమ, ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పీసీసీఎఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటవీ భూముల క్రమబద్ధీకరణ హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పీసీసీఎఫ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు...

ఏడేళ్లలో 50 వేల ఎకరాల అడవులు అన్యాక్రాంతం...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అటవీ భూములను ఆక్రమించిన గ్రామస్తులను వేధించరాదంటూ గత జూన్‌ 22న అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ సెక్షన్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. కానీ 2014 జూన్‌కు ముందు కబ్జాకు గురైన అటవీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అటవీశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2005 డిసెంబర్‌ 13 నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–2006) హక్కులు కల్పించింది. ఈ చట్టం కింద 1,86,534 దరఖాస్తులు రాగా అందులో అర్హతగల 93,494 దరఖాస్తులను ఆమోదించి 3,00,092 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన అటవీ భూముల కబ్జాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ వద్ద సమాచారం లేదు.

2008–09లో సైతం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పెద్ద ఎత్తున అడవులను నరికేసి భూములను కబ్జా చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 2007 నుంచి 2014 నాటికి కొత్తగా 58,032 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల్లో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటూ సిబ్బందిపై భౌతిక దాడులు చేసేలా స్థానికులను ప్రోత్సహిస్తున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు...

  1. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన గన్‌మెన్లతో కలసి గత నెల 18న కొత్తగూడెం పరిధిలోని చాటకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 100 ఎకరాల అటవీ భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నారు. అటవీ సిబ్బందిని బెదిరించి బలవంతంగా అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అవి అటవీ భూములంటూ కలెక్టర్‌ ఫోన్‌లో ధ్రువీకరించినా లాభం లేకపోయింది.
  2. జూలై 7న బెల్లంపల్లి డివిజన్‌లో గిరెపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రాజారాం, వెమనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి మూడోసారి అటవీ భూముల కబ్జాకు ప్రయత్నించారు.
  3. పాఖాల్‌ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో అటవీ భూమిని ట్రాక్టర్‌తో చదును చేసే యత్నాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి డి. నాగరాజుపై అశోక్‌నగర్‌ గ్రామ సర్పంచ్‌ సాయిలు, గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
  4. నిజామాబాద్‌ జిల్లా హాజీపూర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలోని 10 హెక్టార్లలో నాటిన మొక్కలను గత నెల 5న బెల్యానాయక్‌ తండావాసులు పీకేశారు.
  5. ఏటూరునాగారం అటవీ సంరంక్షణ ప్రాంతంలో గత నెల 5న ఐదు ట్రాక్టర్లతో భూములను చదును చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వెళ్లిన వరంగల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌తోపాటు మరో ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను గ్రామస్తులు రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 13 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించారు.
  6. పెద్దపల్లి అటవీ ప్రాంతంలోని 75 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై గత నెల 5న కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు.
  7. మామిడిగూడ అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై గత నెల 2న టడ్వాల్‌ మండలం బోటిలింగాల గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. 

మరిన్ని వార్తలు