ఏ రాష్ట్ర కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే బదిలీ

13 Feb, 2019 03:23 IST|Sakshi

స్పష్టతనిచ్చిన తెలంగాణ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లపై విచార ణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందం టూ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 40(3) చెబుతున్న నేపథ్యంలో, ఇలాంటి వ్యాజ్యాలపై ఏ రాష్ట్ర హైకోర్టు విచారించాలన్న అం శంపై తెలంగాణ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ మం గళవారం స్పష్టతనిచ్చింది. ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లు,  రిట్‌ అప్పీళ్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు, పునః సమీక్షా పిటిషన్లను రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఇరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విషయం లో మాత్రం, ఆ వ్యాజ్యాల్లోని ప్రధాన అంశం ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో నిర్ణయించి, దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో సీజే పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కో కేసు ఆధారంగా సీజే జారీ చేసే పాలనాపరమైన ఉత్తర్వుల ఆధారంగా ఆ కేసుల బదలాయింపు జరపాల్సి ఉంటుందని పేర్కొంది.

సర్వీసు వివాదాల విషయంలోనూ దీన్నే అనుసరించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఫుల్‌బెంచ్‌ తీర్పు వెలువరించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 40(3) వల్ల ఏపీ హైకోర్టు న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి ఈ వ్యవహారంపై తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు సీజేకి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన సీజే దాన్ని పిల్‌ పరిగణించారు. ఈ వ్యాజ్యంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిపై ఫుల్‌బెంచ్‌ను ఏర్పాటు చేయడమే మేలని నిర్ణయించి ఆ మేర ఫుల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు