ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం టీ-హబ్

24 Jan, 2015 01:29 IST|Sakshi
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం టీ-హబ్

* ఐఐఐటీలో తొలిదశ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
* రెండేళ్లలో 3 వేల ఉద్యోగాలు, 400 కంపెనీల ఏర్పాటే లక్ష్యం
* రాయదుర్గంలో రూ. 200 కోట్లతో రెండో దశకు ప్రభుత్వ యోచన

సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టెక్నాలజీ హబ్ (టీ-హబ్)కు రూపకల్పన చేసినట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హైదరాబాద్‌లోని ఐఐఐటీ ప్రాంగణంలో రూ. 35 కోట్లతో చేపట్టిన టీ-హబ్ మొదటి దశకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, చట్టం తదితర రంగాల సమ్మిళితంగా టీ-హబ్ ఏర్పాటు కానుందన్నారు.

ఐఐఐటీ-హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్  యూనివర్సిటీ  సంయుక్తంగా టీ-హబ్ ద్వారా సేవలందించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. వచ్చే జూన్ నాటికి టీ-హబ్ మొదటి దశను ప్రారంభిస్తామని, 3 వేల ఉద్యోగాలు, 400 కంపెనీల ఏర్పాటే దీని లక్ష్యమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రూ.200 కోట్లతో రాయదుర్గంలో రెండోదశ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

రెండోదశలో 10 వేల మందికి ఉద్యోగాల కల్పన, వెయ్యికిపైగా కంపెనీల ఏర్పాటును నిర్దేశించుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా యువత వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు టీ-హబ్ దోహదపడనుందన్నారు. టీ-హబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
 
జంక్షన్లను మెరుగుపరుస్తాం...
ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే రెండో నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో ప్రత్యక్షంగా 7 లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా 15 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఐటీ జోన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జంక్షన్లను మెరుగుపరుస్తామన్నారు. హైదరాబాద్ వేదికగా 2018లో ప్రపంచ ఐటీ సదస్సు జరగనున్నందున ఐటీ జోన్లలో మౌలికవసతుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయన్నా రు. విప్రో, గూగుల్, అమెజాన్, డి-లింక్, టీసీఎస్.. వంటి దిగ్గజ సంస్థల విస్తరణ, హైదరాబాద్‌లో కొత్త శాఖల ఏర్పా టు, మెరుగైన సదుపాయాల కల్పన ద్వారా మూడేళ్లలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకోనుందన్నారు.
 
మెరుగైన రియల్ వ్యాపారం...
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం 30 శాతం పుంజుకున్నట్లు ఆయా వర్గాల నుంచి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలతోపాటు చిన్నచిన్న పరిశ్రమలను కూడా ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన శిక్షణ, సహకారం, నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, టీ-హబ్ డెరైక్టర్ బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి, నల్సార్ వర్సిటీ వీసీ ఫైజాన్ ముస్తఫా, ఐఐఐటీ డెరైక్టర్ నారాయణన్, టెక్ మహీంద్ర సీటీవో ఎ.ఎస్. మూర్తి, ఐఎస్‌బీ అసోసియేట్ డెరైక్టర్ అరుణారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు