విత్తనరంగంలో తెలంగాణ ఆదర్శం

25 Nov, 2018 03:15 IST|Sakshi

ఎఫ్‌ఏవో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బుకార్‌ టిజాని ప్రశంస 

గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా తెలంగాణను గుర్తించిన ఎఫ్‌ఏవో

సాక్షి, హైదరాబాద్‌: విత్తనరంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బుకార్‌ టిజాని ప్రశంసించారు. రోమ్‌ పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కేశవులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుకార్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇతర దేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులకు నాణ్యమైన విత్తనం అందించేలా చేయాలన్నది ఎఫ్‌ఏవో నిబంధనల్లో ఒక కీలకమైన అంశమని చెప్పారు. భారత్‌ ఇప్పటికే ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనాభివృద్ధి కోసం ఎఫ్‌ఏవోకు తెలంగాణ సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌లో విత్తన పార్కును నెలకొల్పి 400 విత్తన కంపెనీలకు అవసరమైన వసతులు కల్పించడం అభినందనీయవన్నారు. అంతర్జాతీయ విత్తనోద్యమంలో తాము తెలంగాణతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో విత్తనోత్పత్తి, విత్తనాభివృద్ధికి గల అవకాశాలను వివరించారు. గ్లోబల్‌ సీడ్‌ హబ్‌గా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నామని ఎఫ్‌ఏవో ప్రకటించినట్లు కేశవులు తెలిపారు. అందులో భాగంగా ఎఫ్‌ఏవో బృందం వచ్చే జూన్, జూలైల్లో రాష్ట్రానికి రానుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు