అడుగు ముందుకుపడని ఆర్డీఎస్‌

15 Apr, 2018 02:12 IST|Sakshi

ఆధునీకరణ అంతే సంగతి

 పనులకు ఏమాత్రం సహకరించని ఏపీ సర్కార్‌

 పైగా తుమ్మిళ్లకు అడ్డుపుల్ల 

సాక్షి, హైదరాబాద్‌: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్‌) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలే అవకాశాలున్నాయి. మూడేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే కానున్నాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన అవాంతరాలతో పనులు ముందుకు సాగకపోవడంతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం పనులు చేసేందుకు మరో రెండు మూడు నెలల వ్యవధిఉన్నా, ఏపీ నుంచి స్పందన లేకపోగా, ఆయకట్టు స్థిరీకరణకై చేపట్టిన తుమ్మిళ్లకు అడ్డుపుల్లలు వేస్తోంది. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది.

కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్‌ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్‌ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ  పనులకు మూడున్నరేళ్లుగా అడ్డుపడుతూ ఉన్నారు. దీంతో ఆర్డీఎస్‌ కింద సాగు ముందుకు సాగడం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్‌వర్క్స్‌ అంచనాను రూ.3కోట్ల నుంచి రూ.13కోట్లకు పెంచగా, దానికి ప్రభుత్వం ఆమోదం సైతం తెలిపింది. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమచేసి, అక్కడి ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూనే, పనులుచేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా అవి జరగడం లేదు. ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్‌ మంత్రుల సమావేశంలో చర్చిదా మని భావించినా ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు సమావేశానికి రాలేదు. అనంతరం ఆర్డీఎస్‌పై సమావేశం అవుదామని లేఖ రాసినా స్పందించ లేదు. దీంతో ఆధునీకరణ పనులు అడుగు ముందుకు కదల్లేదు.  


తుమ్మిళ్లకు అడ్డుపుల్ల... 
ఇక వినియోగించని తుంగభద్ర జలాల్లో వాటా మేరకు వాడుకునేలా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి కూడా ఆంధ్రప్రదేశ్‌ అడ్డుపడుతోంది. 15.90 టీఎంసీల కేటాయింపులో 5 టీఎంసీలకు మించి వినియోగం లేనందున తుమ్మిళ్ల చేపట్టి 5.44 టీఎంసీల నీటిని సుంకేశుల రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తీసుకుని ఆర్డీఎస్‌ కాల్వల్లో పోయాలని ప్రణాళిక వేసింది. అయితే దీనిపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తుమ్మిళ్లను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలని, నిర్మాణ పనులు కొనసాగకుండా చూడాలని బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది.  

మరిన్ని వార్తలు