జూలై నాటికి 20.74 టీఎంసీలు అవసరం

9 Sep, 2017 03:15 IST|Sakshi

‘సాగర్‌’ కింద తాగునీటి అవసరాలపై తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కింద తాగునీటి అవసరాలపై కృష్ణా బోర్డుకు తెలంగాణ స్పష్టతనిచ్చింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది జూలై వరకు హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 20.74 టీఎంసీల నీరు అవసరమని తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ తాగునీటికి 15.15, నల్లగొండకు 5.59 టీఎంసీలు అవసరమని పేర్కొంది. ఇందుకు తగ్గట్టు శ్రీశైలం నుంచి సాగర్‌కు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డుకు శుక్రవారం లేఖ రాసింది. కర్నూలు, అనంతపురం జిల్లాల తాగునీటి అవసరాలకుగాను హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి నీటి విడుదలకు వీలుగా శ్రీశైలం నుంచి తక్షణం 2 టీఎంసీలు కేటాయించాలని బోర్డును ఏపీ కోరింది.

కానీ తెలంగాణ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు విడుదల చేసేందుకు నిరాకరించింది. శ్రీశైలంలో 32.47 టీఎంసీల నీరుందని, ముచ్చుమర్రి కింద నీటి పంపులు పనిచేయాలంటే 811 అడుగుల వరకు నీరుండాలని తెలిపింది.  సాగర్‌లో 115 టీఎంసీల నీరుందని, అందులోంచే అప్రోచ్‌ చానల్‌ను డ్రెడ్జింగ్‌ చేసి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చొచ్చని చెప్పింది. శ్రీశైలంలో మరో 30 టీఎంసీల మేర నీరొస్తుందని ఆశించినా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అనుకున్న మేర రాలేదంది. ప్రస్తుతం సాగర్‌ కుడి కాల్వల కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి తీవ్ర కటకట ఉందని, తామూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించింది.

మరిన్ని వార్తలు