నువ్వా.. నేనా?

20 Jan, 2019 12:20 IST|Sakshi
శంషాబాద్‌ మండలం అలీకోల్‌ తండాలో రుక్మిణి హన్మత్‌ నాయక్‌ ప్రచారం

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అభ్యర్థులు చివరి రోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల పెద్దలు రంగంలోకి దిగి తమ అనుచరుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ర్యాలీలతో హోరెత్తించారు. తొలి విడతగా సోమవారం షాద్‌నగర్, రాజేంద్రనగర్‌ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలోని ఏడు మండలాల్లో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 20 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 159 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి 
దాదాపు పది రోజులపాటు విస్తృతంగా సాగిన ప్రచారానికి శనివారం తెర పడడంతో అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారిస్తున్నారు. ఏ అభ్యర్థి వెళ్లినా ‘మీకే నా ఓటు’ అంటున్న ఓటర్లు చేజారకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం, డబ్బులు, చీరలు ఇతర తాయిలాలు ఎరవేస్తూ తమవైపు ఉండేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నోటు, మద్యందే పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఉన్న పల్లెల్లో ఓటుకు రూ.1000 రూ.1,500 పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇతర గ్రామాల్లో కనిష్టంగా రూ.500 పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.

ఏర్పాట్లు పూర్తి 
ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని ఆదివారం నిర్దేశిత పంపిణీ కేంద్రాల వద్ద అందజేయనున్నారు. మొత్తం 4వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 1,341 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు పెంచారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇది పూర్తికాగానే వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1.90 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   

మరిన్ని వార్తలు