మోగిన పంచాయతీ నగరా

2 Jan, 2019 12:54 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21, 25, 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలు, 3,544 వార్డులు ఉన్నా యి.

మొత్తం ఓటర్లు 4,64,199 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,33,052, పురుషులు 2,31,138, ఇతరులు 9 మంది ఉన్నారు. అందులో బీసీలు 2,71,027, ఎస్సీలు 81,557, ఎస్టీ ఓటర్లు 72,363, జనరల్‌ 39,242 మంది ఉన్నారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి ఎస్సీలకు 75, ఎస్టీలకు 101, బీసీలకు 69, అన్‌రిజర్వ్‌డ్‌కు 156 గ్రామపంచాయతీలు కేటాయించా రు. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ ప్రక్రియనంతా డిసెంబర్‌ 29న పూర్తి చేశారు. 
మూడు విడతల్లో.. జిల్లాలో మూడు 

విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న  మొదటి విడతలో 145 గ్రామపంచాయతీలు, 1,264 వార్డులకు, ఈ నెల 25న రెండో విడతలో  136 గ్రామపంచాయతీలు, 1,210 వార్డులకు, ఈ నెల 30న మూడో విడతలో 120 గ్రామ పంచాయతీలు, 1,070 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి.

మొదటి విడత.. 
మొదటి విడతకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న స్క్రూట్నీ, 11న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. గుర్తుల కేటాయింపు తర్వాత జనవరి 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది.

రెండో విడత
రెండో విడత ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూట్నీ, 15న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. 

మూడో విడత
మూడో విడతకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న స్క్రూట్నీ, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జనవరి 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. 
ఉదయం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు.. 

గ్రామపంచాయతీ ఎన్నికలను ఎప్పటిలాగే ఉదయం నిర్వహించి సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. మధ్నాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం  ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామంలోని వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వార్డుల వారీగానే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్‌ ఓట్లను లెక్కించి అప్పటికప్పుడే ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తిగా బ్యాలెట్‌ పేపర్లతో జరుగనున్న ఎన్నికలు కావడంతో కొన్ని గ్రామాల్లో  ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫలితంపై పోటీలో ఉన్న  అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే రీకౌంటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

జనరల్‌కు రూ.2 వేలు డిపాజిట్‌..
జనరల్‌ స్థానంలో గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే వారు రూ.2 వేలు, వార్డు మెంబ ర్‌కు రూ.500, రిజర్వేషన్‌ అయిన గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1,000, వార్డు మెంబర్‌ స్థానాలకు రూ.250 డిపాజిట్‌ చెల్లించా ల్సి ఉంటుంది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో  సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2.5 లక్షలు, వార్డు మెంబర్‌ అభ్యర్థులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయొద్దు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు మెంబర్‌ అభ్యర్థులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయొద్దు అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది.

తొలిసారిగా ‘నోటా’ 
ఎన్నికల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఎన్నికల సంఘం తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటాను ప్రవేశపెట్టింది. ఇది బ్యాలెట్‌ పేపర్‌లో చివరి స్థానంలో ఉంటుంది.  సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సారి నోటా ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.  

మండలం పేరు      జీపీలు    వార్డులు
చెన్నారావుపేట     30    258
నెక్కొండ              39    340
ఆత్మకూరు          16    152
దామెర               14    132
గీసుకొండ            21    188
మొత్తం              401    3,544

మండలం పేరు     జీపీలు   వార్డులు
పరకాల                 10    94
నడికుడ                14     138
శాయంపేట             24        212
నల్లబెల్లి                 29    252
ఖానాపురం            20       178
రాయపర్తి              39     336 

మరిన్ని వార్తలు