మా కులమే అనర్హతా?

28 May, 2018 01:49 IST|Sakshi
రెడ్లసమరభేరి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, జయప్రద, నాయిని నర్సింహారెడ్డి తదితరులు 

రెడ్ల సమర భేరీలో పలువురు నాయకుల ప్రశ్న

అగ్రకులాల్లో పేదలు పాలకులకు కనిపించరా?

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్‌ ఫండ్‌తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాజా బహద్దూర్‌ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. 

ఈబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి: నాయిని 
అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్‌రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. 

దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్‌రెడ్డి 
తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్‌ చైర్మన్‌ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు