తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట

15 Jan, 2015 03:42 IST|Sakshi
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట
  • ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
  • హుజూరాబాద్: ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలవదని చరిత్ర రుజువు చేసిందని, అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇప్పల్‌నర్సింగాపూర్‌లో రైతులకు కృషి రత్నం అవార్డులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కిసాన్ రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  

    ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయంపై 75 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 3,376 కోట్లు రుణమాఫీ చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలోనే రూ. 4,250 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కాలం కాకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, వచ్చే ఏడాది వరకు కొంత మేరకు కష్టాలు గట్టెక్కుతాయని, మరో మూడేళ్లలో కంటి రెప్పపాటు కూడా కరెంటు కోతలు ఉండవని పేర్కొన్నారు.
     
    ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదు

    జమ్మికుంట: ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదని, అది ప్రజలందరిదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పరమావధిగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

    అధికారం ముళ్ల కిరీటం లాంటిదని, అది అందరికీ రాదని, ప్రజల ఓట్లతో వచ్చిన అధికారాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పాత్ర గొప్పదని, ఒక గ్రామంలో పదిమంది ఐఏఎస్‌లు ఉండవచ్చు కానీ.. ఆ గ్రామానికి ఒక్కరే సర్పంచ్ ఉంటారని, నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారని అన్నారు. గ్రామాలలో వార్డు సభ్యులే మూల స్తంభాలని, ప్రభుత్వపరంగా వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులతో సక్రమంగా ఉంటే గ్రామాలలో సమస్యలు తలెత్తవని సూచించారు.

మరిన్ని వార్తలు