మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ తెలంగాణ

29 Aug, 2016 06:07 IST|Sakshi
మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ తెలంగాణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డును దక్కించుకుంది. ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ‘ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్’లో భాగంగా ఈ అవార్డు వచ్చింది. అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత, నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృ  క్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన విజేతలకు 11 ఏళ్లుగా సీఎన్‌బీసీ గ్రూప్ ఈ అవార్డు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 30న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి సీఎన్‌బీసీ గ్రూప్ ఆహ్వానం పంపింది.

ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ అవార్డును అందుకోనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌లతో చర్చాగోష్ఠి ఉంటుందని సీఎన్‌బీసీ తెలిపింది. రాష్ట్రానికి బిజినెస్ లీడర్స్ అవార్డు రావటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇప్పటికే అనేక సంస్థలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని, ప్రభుత్వ పాలనకు, పారదర్శకతకు ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు