దక్షిణాదిలో మనమే టాప్‌

5 Mar, 2020 01:45 IST|Sakshi

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా తెలంగాణ రాబడులు

జనవరి నాటికి బడ్జెట్‌ అంచనాల్లో 77.19 శాతం ఆదాయం

తర్వాత 76 శాతం రాబడులతో రెండో స్థానంలో తమిళనాడు

మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కన్నా మెరుగ్గా 62 శాతం ఆదాయంతో ఏపీ ముందంజ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం ప్రభావం కొంత ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆదాయం బాగానే వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన నాలుగు రాష్ట్రాల కన్నా ఈ ఏడాది మనకు మెరుగైన ఆదాయమే వస్తోంది. 2019–20 బడ్జెట్‌ అంచనాల్లో ఈ ఏడాది వస్తుందని అంచనా వేసిన 1.37 లక్షల కోట్ల ఆదాయానికి గాను రూ.1.05 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చినట్టు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ లెక్కలు చెబుతున్నాయి. మన తర్వాత దక్షిణాదిలోని తమిళనాడులో 76 శాతం ఆదాయం వచ్చింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ అంచనాలకు గాను జనవరి ముగిసే నాటికి 62 శాతం ఆదాయం రాగా, మహారాష్ట్ర (59), ఉత్తరప్రదేశ్‌ (59), పంజాబ్‌ (48 శాతం)ల కన్నా ఏపీ ఆదాయం మెరుగ్గా ఉండటం గమనార్హం.

కర్ణాటక, కేరళ, ఏపీ మన తర్వాతే..: దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆదాయం బాగానే వస్తోందని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 77 శాతం ఆదాయం సమకూరగా, తమిళ నాడులో 76 శాతం వచ్చింది. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే కర్ణాటకలో 70 శాతం, కేరళలో 66 శాతం, ఏపీలో 62 శాతం రాబడులు వచ్చాయి. రూపాయల పరంగా చూస్తే అత్యధికంగా తమిళనాడు రాబడులు ఇప్పటికే రూ.1.81 లక్షల కోట్లు కాగా, కర్ణాటకలో రూ. 1.58 లక్షల కోట్లు, ఏపీలో రూ.1.33 లక్షల కోట్లు, కేరళలో రూ.94వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.


 

మరిన్ని వార్తలు