ఐటీలో హై అలర్ట్‌! | Sakshi
Sakshi News home page

ఐటీలో హై అలర్ట్‌!

Published Thu, Mar 5 2020 1:46 AM

Covid 19 Panic At Hyderabad Mindspace - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీకి కేంద్ర బిందువుగా ఉన్న మాదాపూర్‌లో బుధవారం కోవిడ్‌ కలకలం రేగింది. మైండ్‌స్పేస్‌ బిల్డింగ్‌–20లోని డీఎస్‌ఎం కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా టెకీకి కోవిడ్‌ వచ్చిందనే సమాచారం రావడంతో ఐటీ జోన్‌ హై అలర్ట్‌ అయింది. వారం రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు కోవిడ్‌ లక్షణాలు బయటపడడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మైండ్‌ స్పేస్‌లోని ఉద్యోగులు నిమిషాల వ్యవధిలోనే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అప్రమత్తమయ్యా యి. వైరస్‌ నివారణ దిశగా చర్యలు చేపట్టాయి.

హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ ,గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, రాయదుర్గం ప్రాంతాల్లో దాదాపు 600కి పైగా ఐటీ సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. వీటిలో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, నైపుణ్య శిక్షణ తదితర కార్యకలాపాల్లో భాగంగా ఇక్కడి ఉద్యోగులు సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌ తదితర దేశాలకు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాగే ఆయా దేశాల నిపుణులు సైతం సాధారణంగా నెలకు సుమారు 5వేల మంది వరకు ఇక్కడకి వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఐటీ జోన్‌లో కోవిడ్‌ కలకలం రేగడంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు పలు సూచనలు చేశాయి. కరచాలనం చేయడం నిలిపివేయాలని పేర్కొనడంతోపాటు విదేశీయానానికి, వారాంతపు టూర్లకు దూరంగా ఉండాలని ఆదేశించాయి. విదేశాలకు వెళ్లి వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టంచేశాయి. తమ కార్యాలయ పరిసరాలు, కామన్‌ ఏరియాలను డిటర్జంట్‌లు, అధిక గాఢత కలిగిన స్పిరిట్‌లతో శుభ్రం చేసినట్టు వెల్లడించాయి.  

వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇవ్వొద్దు: జయేశ్‌ రంజన్‌ 
కోవిడ్‌పై వస్తున్న వదంతులను నమ్మి వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇవ్వవద్దని ఐటీ కంపెనీలకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సూచించారు. ఒకవేళ వర్క్‌ ఫ్రం హోమ్‌కు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఓ మహిళా టెకీకి కోవిడ్‌ లక్షణాలు ఉండటంలో మైండ్‌స్పేస్‌లో కంపెనీలు మూసివేస్తున్నారని ప్రచారం జరగడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైండ్‌స్పేస్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇటీవల ఇటలీ నుంచి హైదరాబాద్‌ వచ్చారని తెలిపారు. కోవిడ్‌ సోకిందనే అనుమానం రావడంతో ఆమె నుంచి నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు. గురువారం ఆ నివేదిక వచ్చిన తర్వా త వివరాలు వెల్లడిస్తామన్నారు.

మైండ్‌స్పేస్‌ 9వ అంతస్తులో ఆమెతో పాటు పనిచేస్తున్న 23 మందిని గుర్తించామని వివరించారు. అదే భవనంలోని 4వ అంతస్తులో ఆమె భర్త పనిచేస్తున్నారని, ఆయనతోపాటు మరో 65 మంది కలిసి పనిచేస్తున్నవారిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. వీరిద్దరూ పనిచేస్తున్న రెండు కంపెనీలతోపాటు అదే భవనంలో ఉన్న మరో రెండు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అవకాశం ఇచ్చాయ న్నారు. అనుమానితులు ఉన్నా.. వైరస్‌ ప్రభావం కేవలం 12 గంటలే ఉంటుందని, గురువారం భార్యాభర్తలు మినహా మిగిలిన ఉద్యోగులంతా ఆఫీస్‌ నుంచి విధులు నిర్వహిస్తారని ఆయన స్పష్టంచేశారు. మాస్క్‌లు అందించేందుకు ఇంటెల్, కాగ్నిజెంట్, వెల్స్‌ఫార్గో, టీసీఎస్, క్యాప్‌ జెమినీ సంస్థలు ముందుకు వచ్చాయని.. దగ్గు, జలుబు ఉన్న వారు మాత్రమే వాటిని ధరించాలని సూచించారు.  

ఐదు శాతం మందికే పాజిటివ్‌ వచ్చే ఛాన్స్‌... 
తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు ఒక్కటి మాత్రమే నమోదైందని రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. మైండ్‌స్పేస్‌లో పనిచేసే మహిళా టెకీ రిపోర్ట్‌ ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 45 నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయని.. ఇద్దరి నమూనాలను మాత్రమే పుణేకు పంపినట్టు తెలిపారు. దాదాపు 81 శాతం మందికి కోవిడ్‌ సోకదని, 14 శాతం మందిలో లక్షణాలు కనిపిస్తాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే కేవలం ఐదు శాతం మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని వివరించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఖాళీ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు.

బయోమెట్రిక్‌ను మార్చేశాం  
కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే బయోమెట్రిక్‌ విధానంలో మార్పులు తీసుకొచ్చాం. వేలి ముద్రతో కాకుండా ఐడెంటిటీ కార్డులతోనూ బయోమెట్రిక్‌ పని చేస్తుంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, రవాణా, ఇంటర్నెట్‌ ఇచ్చే అంశాలపై సూచనలిచ్చాం. ముందు జాగ్రత్తలపై కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నాం.  
– మురళి బొళ్లు, హైసియా అధ్యక్షుడు 

వదంతులు నమ్మొద్దు
రహేజా మైండ్‌స్పేస్‌లోని భవనం నెంబర్‌ 20లో శానిటైజేషన్‌ చేశాం. ఆ భవనంలోని మొత్తం 9 కంపెనీలలో దాదాపు 7,300 మంది ఉద్యోగులు ఉన్నారు. నాలుగు కంపెనీలలో దాదాపు రెండు వేల మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ఒక్కరోజు అనుమతి ఇచ్చారు. కంపెనీలు ఖాళీ అవుతున్నాయనే వదంతులను ఎవరూ నమ్మవద్దు. 
– శ్రవణ్‌ గోనే, రహేజా సీఈఓ 

Advertisement
Advertisement