ఈ గడ్డమీద చదవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే

19 Dec, 2017 19:39 IST|Sakshi

తెలుగును మృత భాష అనడం బాధ కలిగించింది

ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి

తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్

ప్రతిఏడాది డిసెంబర్ నెలలో తెలుగు సదస్సు నిర్వహిస్తాం

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించిన సమయలో చాలా బెరుకుగా ఉన్నాను.. కానీ ఈ మహాసభలు విజయవంతం కావడంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు మహాసభలు ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఓనాడు 1974లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ మహాసభలకు వచ్చాను. నేడు ముఖ్యమంత్రి హోదాలో తెలుగు కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సభలు నిర్వహించాం. తెలుగు భాషా ఖ్యాతిని చాటి చెప్పింది మన తెలంగాణ. ఈ మహాసభలు విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే వేదికగా తెలుగు భాషను కాపాడుకోవాలని, తెలుగును మృత భాష అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనడం నిజంగా చాలా బాధాకరం. వెంకయ్యనాయుడు చెప్పినట్లుగా మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

అందుకే సభలు పూర్తయ్యాక కూడా ప్రతిఏడాది డిసెంబర్ నెలలో తెలుగు సదస్సు నిర్వహిస్తాం.  ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష చదవడాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఈ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే. తెలుగు భాషను రక్షించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుందో ఈ ప్రపంచానికి తెలిసింది. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరనింహన్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 40 దేశాల ప్రతినిధులు, దేశంలోని 17 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చిన అందరికీ వందనం.. అభినందనం. తెలుగు మహాసభలను విజయవంతం అయ్యేందుకు నందిని సిదారెడ్డి, ఎస్పీ సింగ్, సాంస్కృతిక శాక కార్యదర్శి వెంకటేశం, ఇతర ప్రభుత్వ అధికారులకు ఎంతో శ్రమించారని’  సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

ఈసారి పద్యంతో ముగించిన సీఎం కేసీఆర్
మొన్న తాను చదివిన పద్యం విని ఎంతోమంది అభినందించారని, అదే విధంగా నేడు మరో పద్యం చదివి వినిపిస్తానంటూ ఆహుతులలో ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్. ‘నవ్వవు జంతువులు.. నరుడు నవ్వును....... నవ్వులు పువ్వులవోలే’ అని పద్యం చదివి  నమస్కారం ఇక సెలవు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ కొన్ని తీర్మానాలు చేశారు.

సీఎం కేసీఆర్ చేసిన తీర్మానాలివీ..

  • ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష కచ్చితంగా చదివేలా అమలు చేస్తాం. ఈ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే
  • భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామని మరోసారి మనవి చేస్తున్నాను. అనతికాలంలోనే పరిష్కారం చూపిస్తాం. భాషా పండితులకు పెన్షన్లో కోత విధిస్తున్నారని విన్నాం. అలాంటివి జరగకుండా చూస్తాం.
  • భాషా పండితులతో సమావేశమై ప్రతి ఏడాది తెలుగు సభలను నిర్వహించడంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం
  • ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరించడం. తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు