జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు

25 Aug, 2014 02:09 IST|Sakshi
జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అం దించడమే తన ప్రధాన లక్ష్యమని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాలమూరు రెడ్డి సేవా సమితి బాలుర వసతి గృహంలో జిల్లాలోని రెడ్డి ప్రతినిధులను సన్మానించారు. సమితి అధ్యక్షుడు టి.ఇంధ్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎం.పి. జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద రెడ్డి పిల్లల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
 
జల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి అందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి తన వంతు సహకారమందిస్తానన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో రెడ్లు ముఖ్యభూమికను పోషిస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెడ్డి సోదరులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరికి తనవంతు సేవలందిస్తానన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధ, కౌన్సిలర్‌లు విఠల్‌రెడ్డి, రవికిషన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మల్లు సరస్వతిని సేవా సమితి సభ్యులు సన్మానించారు.
 
అథితులుగా హాజరైన జయరామ మోటర్స్ అధినేత బెక్కరి రాంరెడ్డి  బాలబాలికల వసతి గృహానికి *10లక్షల విరాళం ప్రకటించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి మల్లు నర్సింహ్మారెడ్డి 2లక్షలు, షాద్‌నగర్ విష్ణువర్ధన్‌రెడ్డి *50వేలు విరాళం ప్రకటించారు. చదువులో విశేష ప్రతిభ కనభర్చిన ముచ్చింతల నివాసి సందీప్‌రెడ్డికి వైద్య విద్య ఎంబిబిఎస్ పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, బి.ఇడి విద్యార్థి లక్ష్మణ్‌కు చదువు ఖర్చు బరిస్తామని రెడ్డి సేవా సమతి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో సలహాదారు వి.మనోహర్‌రెడ్డి, ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి.చిన్నారెడ్డి, పి.రాఘవరెడ్డి, ప్రచార కార్యదర్శి యన్.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు