రైతుల భూములకు సర్కారు బేరం!

12 Dec, 2014 00:39 IST|Sakshi
రైతుల భూములకు సర్కారు బేరం!
  •  సీఆర్‌డీఏకు విశేషాధికారాలు కల్పిస్తున్న ముసాయిదా బిల్లు
  •  రైతులు ఒప్పుకుంటే భూసమీకరణ.. ఒప్పుకోకపోతే భూసేకరణ
  •  సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లులో సమీకరణకు విధివిధానాలు
  •  స్థిరచరాస్తుల సేకరణకు ప్రత్యేక ‘మార్గదర్శకాలు’
  •  సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం రైతుల నుంచి సేకరించే భూములను ఆ తర్వాత అమ్ముకోవడానికి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు అధికారం కట్టబెట్టనున్నారు. తుళ్లూరు ప్రాంతంలో రైతుల నుంచి సేకరించే భూముల్లో 13,836 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములను సేకరించడానికి వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేస్తోంది.

    సీఆర్‌డీఏకు సంబంధించిన రూపొందించిన బిల్లును త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ముసాయిదా బిల్లు ప్రకారం ప్రభుత్వం సేకరించే భూములపై సీఆర్‌డీఏకు విశేషాధికారాలు కట్టబెట్టనుంది. సమీకరణ కు పలు మార్గదర్శకాలు పొందుపరిచారు. ప్రభుత్వం సేకరించిన భూములను సీఆర్‌డీఏకు బదలాయిస్తారని.. ఆ భూములను ఎలాంటి అవసరాలకైనా విక్రయించుకోవడానికి అథారిటీకి అధికారం ఉంటుందని బిల్లులోని 104 సెక్షన్‌లో పొందుపరిచారు.

    రాజధాని కోసం తొలి విడతలో 29 గ్రామాల్లో భూములను సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం భూములను ఏవిధంగా సమీకరించాలన్న అం శాలను బిల్లు ముసాయిదాలోని సెక్షన్ 100 లో పొందుపరిచారు. భూ సమీకరణకు అంగీకరించనిపక్షంలో 2013 భూ సేకరణ చట్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.కొత్త రాజధాని ప్రాంతంలో స్థిర, చరాస్తులను సేకరించే అధికారాన్ని సీఆర్‌డీఏకు కట్టపెట్టారు. స్థిర, చరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా లేదా మార్పిడి లేదా కానుకలుగా లేదా తాకట్టు పద్ధతిలో లేదా సంప్రదింపుల ద్వారా సేకరించవచ్చునని ముసాయిదాలో పేర్కొన్నారు.

    భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) విధానానికి అంగీకరించని యజమానులతో సీఆర్‌డీఏ తొలుత పరస్పర సంప్రదింపులు, అంగీకారం విధానంలో భూ మిని సేకరించేందుకు ప్రయత్నించాలని నిర్దేశించారు. అవి కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి జరుగుతాయని, ఈ షరతులు, నిబంధనలకు భూ యజమానులు అంగీకరించిన పక్షంలో సంప్రదింపుల ద్వారా సెటిల్‌మెంట్ చేసుకోవాలని వివరించారు. ఈ విధానానికి కూడా అంగీకరించని పక్షంలో 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలేమంటే...
         
    అవసరమైన ఎలాంటి భూమినైనా లేదా రిజర్వ్ చేయడానికైనా 2013 భూ సేకరణ చట్టం కింద అథారిటీ (సీఆర్‌డీఏ) సేకరిస్తుంది. మౌలిక అభివృద్ధి లేదా ప్రాదేశిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి, జోనల్ అభివృద్ధి ప్రణాళికల కోసం అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ లేదా టౌన్ ప్లానింగ్ లేదా అభివృద్ధి ప్రణాళిక కింద సేకరిస్తారు.
         
    అలా సాధ్యం కాని పక్షంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా సహాయ, పునరావాసం కల్పిస్తూ తగిన పరిహారాన్ని చెల్లించి సేకరిస్తారు. అథారిటీ కోరిక మేరకు ఈ భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును సీఆర్‌డీఏ ఏర్పాటు చేస్తుంది. సేకరించిన, కేటాయించిన, కొనుగోలు చేసిన, ఇతర మార్గాల్లో సమీకరించిన భూమలను ఈ బ్యాంకు పరిధిలోకి తీసుకొస్తారు.
         
    ప్రభుత్వం, సీఆర్‌డీఏల మధ్య పరస్పర అంగీకారంతో ఆ ప్రాంతంలోని అభివృద్ధి చెందిన లేదా అభవృద్ధి చెందని ఎటువంటి భూమినైనా విక్రయించుకోవడానికి బిల్లులో సెక్షన్ 102(3) కింద వీలు కల్పించారు.
         
    నిర్ధారించిన నిబంధనల మేరకు ప్రభుత్వ అసైన్డ్ భూములను అధారిటీ స్వాధీనం చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ నిర్ధారించిన పరిహారాన్ని అసైన్డ్ భూముల వారికి చెల్లిస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించే భూమికి నష్టపరిహారం చెల్లించకుండా వారు కోరితే మరో ప్రాంతంలో అభివృద్ధి హక్కుల బదిలీ (టీడీఆర్) చేయడానికిగాను అభివృద్ధి హక్కు పత్రం (డీఆర్‌సీ) ఇస్తారు.
         
    ఈ హక్కుల బదిలీ ఆ భూమి విలువతో సమానంగా ఉండేలా చూడాలి. ఈ టీడీఆర్‌ను నిర్మాణ ప్రాంతం పెంచుకోవడానికి కూడా వినియోగించుకోవచ్చు. భూమి ఇచ్చే వ్యక్తి దీన్ని సొంతగా వినియోగించుకోవచ్చు లేదా ఎవరికైనా విక్రయించుకోవచ్చు.
         
    స్వాధీనం చేసుకున్న స్థిర, చరాస్తులను అధారిటీ పేరుతో తన వద్దే ఉంచుకోవడం లేదా విక్రయించడం లేదా కాంట్రాక్టుకు ఇచ్చే అధికారం సీఆర్‌డీఏ కలిగి ఉంటుంది.
     

మరిన్ని వార్తలు