ఆ రైతన్నలు.. అపర భగీరథులు

6 Jan, 2015 03:38 IST|Sakshi
ఆ రైతన్నలు.. అపర భగీరథులు

నాడు భగీరథుడు కఠోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి గంగమ్మను దివి నుంచి భువికి రప్పించాడు. ఇది పురాణ గాథ. నేడు జగిత్యాల మండలం గుల్లకోట రైతన్నలు పాతాళగంగను పైకి తెచ్చేందుకు మరో తపస్సు చేస్తున్నారు. ఒకటికాదు, రెండు కాదు.. ఒక్కో రైతు ఏకంగా పదికి పైగా బోర్లు తవ్వించాడు. అదృష్టం కలిసొచ్చి కొంతమందిని గంగమ్మ కరుణించింది. మరికొంత మంది రూ.లక్షలు ధారబోసినా జలసిరి జాడ కనిపించడం లేదు. అయినా వారు తమ ప్రయత్నాన్ని వీడకుండా అపరభగీరథులు అనిపించుకుంటున్నారు.       
 -జగిత్యాల రూరల్

 
జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం గుల్లకోట గ్రామస్తులు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ జనాభా 1920 కాగా, సుమారు 830 ఎకరాల సాగుభూమి ఉంది. రైతులంతా పంటల సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైనే నమ్ముకున్నారు. కాల్వనీళ్లు అందనప్పుడు వ్యవసాయ బావులు, బోర్లతో పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా తమ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ నీళ్లు లేక వెలవెలబోతోంది.

ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీటి కొరత వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు అరకొరగానే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలృు దష్టిలో పెట్టుకుని రబీకి సాగునీరందించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. కానీ వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని రైతులు రబీలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇప్పటికే వేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు తవ్వుతున్నారు.

ఇలా నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 63 మంది రైతులు 123 బోర్లు తవ్వించారు. వాటికి అవసరమైన విద్యుత్ మోటార్లతో పాటు పైపులైన్ల వేసుకున్నారు. నాలుగైదు బోర్లు తవ్వగా కొందరు రైతులకు నీళ్లు రాగా, మరికొందరు రైతులు ఇంకా బోర్ల తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే గ్రామంలోని రైతులు బోర్ల తవ్వకాలు, మోటార్లు, పైపులైన్ల కోసం సుమారు రూ.2.5 కోట్లు ధారబోయడం గమనార్హం. ఇందుకోసం కొంతమంది రైతులు గతంలో దాచుకున్న డబ్బును ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద  అప్పులు చేస్తున్నారు.

గ్రామానికి చెందిన రైతులందరికీ వ్యవసాయమే జీవనాధారం కాబట్టి.. ప్రభుత్వం ఓ పక్కన పంటలు సాగుచేయవద్దని చెబుతున్నా వారు మాత్రృం అదష్టాన్ని పరీక్షించుకునేందుకే సిద్ధపడుతున్నారు. బోర్లలో నీళ్లుపడితే విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ జనరేటర్ సాయంతో అయినా పంటలను కాపాడుకుంటామని అంటున్నారు. గుల్లకోట రైతుల పరిస్థితి నేడు జిల్లాలోని అన్నదాతల దుస్థితికి అద్దంపడుతోందంటే అతిశయోక్తి కాదు.

మరిన్ని వార్తలు