తరగతులు పది.. టీచర్లు ముగ్గురే!

21 Jul, 2014 02:08 IST|Sakshi

ఘట్‌కేసర్ టౌన్:  ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామని చెబుతున్న అధికారులు, ప్ర జాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించక పోవడంతో పేదల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పాఠాలు బోధించేవారు లే క విద్యార్థులు టీసీలను తీసుకొని ఇతర పాఠశాలల్లోకి వెళ్తున్నారు. అయినా విద్యాధికారుల్లో చలనం రావడం లేదు.

 ఒకే భవనంలో బోధన...
 ఘట్‌కేసర్ పట్టణం బాలాజీనగర్‌లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను 2012లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసినా ఒకే భవనంలో విద్యను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 46 మంది, ఉన్నత పాఠశాలలో 34మంది కలిపి మొత్తం 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతిలో 9 మంది విద్యార్థులున్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయురాలు సురేఖ ప్రస్తుతం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

హైస్కూలుగా ప్రమోట్ చేసినా ప్రైమరీ, హైస్కూల్ తరగతులు ఒకే భవనంలో నిర్వహించడంతో విద్యార్థులు, టీచర్లకు అగమ్యగోచరంగా ఉంది. ప్రాథమిక పాఠశాల రెగ్యులర్ టీచర్‌గా ఒకరు పనిచేస్తుండగా మూడు రోజుల క్రితం నారపల్లి నుంచి ఒక టీచర్ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఇలా మొత్తం పది తరగతులకు ముగ్గురే టీచర్లు ఉన్నారు. అన్ని తరగతులకు వీరే బోధిం చడం సాధ్యం కాక విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదు. అనివార్య పరిస్థితుల్లో టీచర్లు రాకుంటే అంతే సంగతులు. ఉర్దూ మీడియం స్కూల్‌ను 2012లో అప్‌గ్రేడ్ చేసిన సర్కారు ఉపాధ్యాయులను మాత్రం ఇప్పటికీ కేటాయించలేదు. ఉర్దూ మీ డియం పాఠశాల కావడంతో ఐదో తరగతి ఉత్తీర్ణులు కాగానే విద్యార్థులు ఆరో తరగతికి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు వెళ్తుండడంతో వారి సంఖ్య కూడా తగ్గుతోంది.

>
మరిన్ని వార్తలు