బర్డ్‌ అంబులెన్స్‌

24 Sep, 2023 06:31 IST|Sakshi

వైరల్‌

చండీగఢ్‌కు చెందిన మన్‌జిత్‌సింగ్‌ ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో డ్రాయిగ్‌ టీచర్‌. పర్యావరణ కార్యకర్త. పక్షుల ప్రేమికుడు. ఏదో పనికోసం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ పట్టణానికి వెళ్లిన సింగ్‌ అక్కడ ఒకచోట ఒక దృశ్యాన్ని చూశాడు. స్వీపర్‌ ఊడుస్తున్న చెత్తలో చనిపోయిన పావురం కనిపించింది. ‘ఎలా చనిపోయింది?’ అని అడిగాడు సింగ్‌. కరెంట్‌షాక్‌కు గురై చనిపోయినట్లు చెప్పింది ఆమె. ‘ఇలా చాలా పావురాలు చనిపోతాయి’ అని కూడా చెప్పింది.

ఈ సంఘటనను సింగ్‌ మరిచిపోలేకపోయాడు. ఆ సమయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి...వ్యాధులు వ్యాపించకుండా చనిపోయిన పక్షులను ఖననం చేయడం, రెండు...ప్రమాదం బారిన పడిన పక్షులకు చికిత్స అందించడం. దీని కోసం తన సైకిల్‌ను ‘బర్డ్‌ అంబులెన్స్‌’గా మార్చి వీధులు తిరుగుతుంటాడు సింగ్‌. ‘మీకు సమీపంలో పక్షులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే దయచేసి నాకు వెంటనే ఫోన్‌ చేయండి’ అంటూ వీధుల్లో కరపత్రాలు పంచుతుంటాడు.

‘ఖాళీ సమయంలో పెయింటింగ్స్‌ వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని నాకు అది ఇష్టం లేదు. ఏ మాత్రం సమయం దొరికినా పక్షుల బాగు కోసం ఉపయోగిస్తాను’ అంటున్నాడు మన్‌జిత్‌సింగ్‌.

మరిన్ని వార్తలు